Begin typing your search above and press return to search.

కియారా విషయంలో నయన్‌ భర్త బోల్డ్‌ కామెంట్స్‌..!

లేడీ సూపర్ స్టార్‌ నయనతార భర్త విఘ్నేష్ శివన్‌ దర్శకుడిగా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

By:  Ramesh Palla   |   25 Aug 2026 11:34 AM IST
కియారా విషయంలో నయన్‌ భర్త బోల్డ్‌ కామెంట్స్‌..!
X

లేడీ సూపర్ స్టార్‌ నయనతార భర్త విఘ్నేష్ శివన్‌ దర్శకుడిగా మెల్ల మెల్లగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. 2022లో కాతువాకుల రెండూ కాదల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విఘ్నేష్‌ తదుపరి సినిమాకు దాదాపుగా నాలుగు ఏళ్ల సమయం తీసుకున్నాడు. నయనతార ప్రారంభించిన నిర్మాణ సంస్థ బాధ్యతలు చూసుకోవడంతో పాటు, పలు కారణాల వల్ల విఘ్నేష్‌ దర్శకుడిగా వరుస సినిమాలు చేయలేక పోతున్నాడు అనేది తమిళ మీడియా వర్గాల వారి మాట. ఈ ఏడాది నయనతార నిర్మాణంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమా వచ్చింది. దర్శకుడిగా విఘ్నేష్ శివన్‌కి మరోసారి నిరాశే మిగిలింది. ప్రదీప్‌ రంగనాథ్‌, కృతి శెట్టి జంటగా నటించిన ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయింది. దర్శకుడి యొక్క ఐడియాను చాలా మంది ప్రశంసించారు. కానీ దాన్ని సినిమాగా మలచిన తీరు బాగాలేదు అనేది టాక్‌.

విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో...

లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ తర్వాత విఘ్నేష్ శివన్‌ నుంచి వచ్చే సినిమా ఏంటా అంటే సమాధానం లేదు. ఇప్పటి వరకు ఆయన తన కొత్త వెంచర్‌ ను ప్రకటించలేదు. కానీ నయనతార నటించిన టాక్సిక్‌ సినిమా ప్రమోషన్‌లో మాత్రం పాల్గొన్నాడు. సాధారణంగా నయనతార సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అయ్యేందుకు ఆసక్తి చూపించదు అనే విషయం తెల్సిందే. టాక్సిక్ సినిమా కోసం కూడా నయనతార మీడియా ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆమె భర్త విఘ్నేష్ శివన్‌ ఇటీవల టాక్సిక్‌ ప్రమోషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో టాక్సిక్ హీరోయిన్‌ కియారా అద్వానీ గురించి విఘ్నేష్ శివన్‌ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తన లవ్‌ ఇన్సూరెన్స్ కంపెనీ ని తానే ట్రోల్‌ చేసుకునే విధంగా విఘ్నేష్ శివన్‌ మాట్లాడటం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ఉంది.

కియారా అద్వానీ హీరోయిన్‌గా...

టాక్సిక్‌ ప్రమోషనల్‌ ఈవెంట్‌లో దర్శకుడు విఘ్నేష్ శివన్‌ మాట్లాడుతూ... కియారా అద్వానీ లక్కీగా ఒక తమిళ్‌ ఫ్లాప్‌ నుంచి బయట పడింది. ఆ సినిమానే ఎల్‌ ఐ కే (లవ్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీ) అన్నాడు. మొదట ఎల్‌ఐకే సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని సంప్రదించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల సినిమాను ఆమె చేయలేదు. ఎల్‌ఐకే సినిమాలో కియారా నటించక పోవడం మంచిది అయింది, ఆమె నటించి ఉంటే తమిళ్‌లో ఆమెకు పెద్ద ఫ్లాప్‌ పడి ఉండేది అని విఘ్నేష్‌ శివన్ సరదాగా తన సినిమాను తానే తక్కువ చేసుకుంటూ మాట్లాడాడు. కియారా నో చెప్పడం వల్ల తన సినిమాలోకి కృతి శెట్టి వచ్చిందని, ఆ ఫ్లాప్‌ కృతి శెట్టి ఖాతాలో పడ్డట్లు అయింది అన్నట్లుగా విఘ్నేష్‌ శివన్‌ చెప్పుకొచ్చాడు. టాక్సిక్‌ ఈవెంట్‌లో లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ గురించి విఘ్నేష్ శివన్‌ చేసిన బోల్డ్‌ కామెంట్స్‌ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశం అయ్యాయి.

యశ్‌ టాక్సిక్ మూవీ రిలీజ్‌...

తన సినిమా గురించి ఏ దర్శకుడు ఇంత బోల్డ్‌గా కామెంట్‌ చేయడు అని కొందరు వ్యాఖ్యానిస్తూ ఉంటే, మరికొందరు కియారా అద్వానీకి ఫ్లాప్‌ తప్పిందని సంతోషిస్తున్న విఘ్నేష్‌, తనకు పడ్డ ఫ్లాప్‌ గురించి చింతించడం లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కియారా అద్వానీకి తెలుగులో సరైన హిట్‌ పడి చాలా కాలం అయింది. భరత్‌ అనే నేను తర్వాత ఆమె తెలుగులో చేసిన సినిమాలు తీవ్రంగా నిరాశ పరిచాయి. అందుకే ఇప్పుడు కన్నడ మూవీ టాక్సిక్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారంలో విడుదల కాబోతున్న యశ్‌ టాక్సిక్‌ సినిమాలో కియారా అద్వానీ హద్దులు దాటి మరీ బోల్డ్‌ గా కనిపించిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య వచ్చిన ఒక పాటలోని కియారా అందాలు వివాదాస్పదం అయ్యాయి. మరీ ఇంత బోల్డ్‌గా అవసరమా అంటూ పలువురు కామెంట్‌ చేశారు. మరి సినిమాలో ఇంకెంత బోల్డ్‌గా ఉంటుందో చూడాలి.