గిఫ్ట్స్ ఓకే కానీ ప్రదీప్ కరుణించాల్సిందేనా?
విఘ్నేష్ శివన్ డైరెక్టర్‌గా భారీ కంబ్యాక్ కోసం గత కొంత కాలంగా స్ట్రగుల్ అవుతున్నాడు.
By: Tupaki Entertainment Desk | 19 Nov 2025 2:17 PM ISTకోలీవుడ్ లవ్ బర్డ్స్‌గా వార్తల్లో నిలిచి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న జోడీ విఘ్నేష్ శివన్, నయనతార. పెళ్లి తరువాత కూడా సూపర్ స్పీడుతో నయన్ కెరీర్ కొనసాగిస్తూ వరుస క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోంది. వివాహం తరువాత హీరోయిన్‌ల కెరీర్ ఆగిపోతుందనే ట్యాగ్‌ని చెరిపేస్తూ వరుస సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటోంది లేడీ సూపర్ స్టార్ నయన్. అయితే విఘ్నేష్ శివన్ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది.
విఘ్నేష్ శివన్ డైరెక్టర్‌గా భారీ కంబ్యాక్ కోసం గత కొంత కాలంగా స్ట్రగుల్ అవుతున్నాడు. స్టార్ హీరోయిన్ అయిన నయన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా తన క్రేజ్ కారణంగా స్టార్స్‌తో అవకాశాలు దక్కించుకున్నా వాటిని నిలబెట్టుకోలేక దర్శకుడిగా విఫలమవుతున్నాడు. `పొడా పొడి` సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ని ప్రారంభించి 13 ఏళ్ల ప్రయాణంలో విఘ్నేష్ శివన్ చేసింది అక్షరాలా ఆరు సినిమాలు మాత్రమే. ఆరవ సినిమా అజిత్ తో చేయాల్సింది. అది క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆగిపోయింది.
దీంతో చేసేది లేక తనని తాను డైరెక్టర్‌గా నిరూపించుకొని మళ్లీ పుంజుకోవడం కోసం ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్‌ని నమ్ముకున్నాడు. తను కరుణించి బ్లాక్ బస్టర్ ఇస్తేనే విఘ్నేష్ కెరీర్ మళ్లీ ట్రాక్‌లో పడుతుంది. ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరో. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి ఆర్టిస్ట్‌గా మారిన ప్రదీప్ ఇప్పుడు వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాడు.
లవ్ టుడే, ఆ తరువాత డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో వరుసగా వంద కోట్ల క్లబ్‌లో చేరి అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తున్నాడు. ప్రస్తుతం తనతో విఘ్నేష్ శివన్ `లవ్ ఇన్సూరెన్స్ కంపనీ` పేరుతో ఓ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీని తెరకెక్కిస్తున్నాడు. దీనికి నయనతారే నిర్మాత. దీనిపైనే విఘ్నేష్ ఆశలు పెట్టుకున్నాడు. ప్రదీప్ కున్న క్రేజ్ తనకు కలిసొస్తుందని, తనకు డైరెక్టర్‌గా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందిస్తుందని విఘ్నేష్ ఆశగా ఎదురు చూస్తున్నాడు. భారీ స్థాయిలో డిసెంబర్ 18న రిలీజ్ కానున్న ఈ మూవీ విఘ్నేష్ ని గట్టెక్కిస్తుందా? ప్రదీప్ కరుణిస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే నయన్ పుట్టిన రోజు సందర్భంగా విఘ్నేష్ శివన్ `రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ స్పెక్టర్ గిఫ్ట్‌గా ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. గిఫ్ట్ చూసిన వారంతా గిఫ్ట్ ఓకే కానీ డైరెక్టర్‌గా హిట్టు కొట్టేదెప్పుడని కామెంట్‌లు చేస్తున్నారు.
