Begin typing your search above and press return to search.

100 కోట్ల క్లబ్ ఊహ నిజం కాలేదని ఫీలైన డైరెక్టర్

యువ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` (LIK) ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   10 May 2026 8:15 AM IST
100 కోట్ల క్లబ్ ఊహ నిజం కాలేదని ఫీలైన డైరెక్టర్
X

యువ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` (LIK) ఇటీవల థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ముఖ్యంగా ప్రదీప్ రంగనాథన్ వరుసగా లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సినిమాలతో అందుకున్న 100 కోట్ల క్లబ్ స్ట్రీక్ ఈ సినిమాతో బ్రేక్ అయ్యింది. సినిమా మే 6న ప్రైమ్ వీడియోలోకి వచ్చిన నేపథ్యంలో విఘ్నేష్ శివన్ తన సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ను షేర్ చేస్తూ తన మనసులోని బాధను పంచుకున్నారు.

ఈ సినిమా గురించి తాను చాలా పెద్ద కలలు కన్నానని విఘ్నేష్ శివన్ ఆ నోట్‌లో పేర్కొన్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కథ కోట్లలో ప్రతిధ్వనిస్తుందని.. సినిమా గోడలను ఊపేస్తుందని నేను నమ్మాను. థియేటర్లలో చప్పట్లు, నవ్వుల వర్షం కురుస్తుందని ఊహించాను. నిజం చెప్పాలంటే 100 కోట్ల క్లబ్‌ను తాకడం కాదు.. దానికి డబుల్ వస్తుందని ఆశించాను. కానీ బెంచ్ మార్క్ అయిన 100 కోట్లను కూడా నా సినిమా చేరలేదు! అని ఆయన నిజాయితీగా అంగీకరించారు. బాక్సాఫీస్ ఫలితం తనను కొంత బాధకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే బాక్సాఫీస్ లెక్కల కంటే ఈ సినిమా విడుదల కావడమే తనకు పెద్ద బ్లాక్‌బస్టర్ అని విఘ్నేష్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమా కోసం తాను చేసిన పోరాటాలు, నిద్రలేని రాత్రులు, ఎవరికీ తెలియని ఆందోళనలు ఎన్నో ఉన్నాయని వెల్లడించారు. నేను గౌరవించే వ్యక్తుల నుండి.. మెచ్చుకునే మనసుల నుండి అభినందనల కోసం ఎదురుచూశాను. కానీ వాస్తవం మరోలా ఉంది. ప్రశంసల కంటే ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయి. అయినా నేను కుంగిపోలేదు.. నా సినిమా విష‌యంలో నేను గర్వంగానే ఉన్నాను! అని వ్యాఖ్యానించారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 70 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసిందని విఘ్నేష్ పేర్కొన్నారు. ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ ప్రకారం... 60.57 కోట్లు రాగా నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రం 66.47 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించింది. ఇది అతిపెద్ద విజయం కాకపోవచ్చు కానీ సందేహాల మధ్య `యావరేజ్` అనే మాటల మధ్య సంపాదించిన నిజమైన ప్రేమ. సమీక్షలతో సంబంధం లేకుండా థియేటర్లకు వచ్చి సినిమాను చూసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు.. అని ఆయన రాసుకొచ్చారు. తన తప్పుల నుండి నేర్చుకుంటూనే ఉంటానని స్పష్టం చేశారు.

విఘ్నేష్ శివన్ చేసిన ఈ పోస్ట్‌కు ఆయన భార్య, నటి నయనతార మద్దతుగా నిలిచారు. ఈ సినిమాను నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్ కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ రొమాన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన మ్యాజిక్ చేయలేక‌పోయిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.