దర్శకుల ఒత్తిడితో... హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్‌లో విద్యా బాలన్ ఒకరు. ఈమె ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మొదటి నుంచి ఎక్కువ బరువు ఉండే వారు.
By: Ramesh Palla | 31 July 2025 1:41 PM ISTబాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్‌లో విద్యా బాలన్ ఒకరు. ఈమె ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మొదటి నుంచి ఎక్కువ బరువు ఉండే వారు. దాంతో బొద్దుగా కనిపిస్తూ ఉండే వారు. ఎంతో ప్రయత్నించి సన్నబడినా కొన్ని నెలల్లోనే మళ్లీ బరువు పెరిగేదట. తన అనారోగ్య సమస్య గురించి విద్యా బాలన్ గతంలో చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో, టాక్ షో ల్లో చెప్పుకొచ్చారు. అలాంటి అనారోగ్య పరిస్థితి ఉన్నప్పటికీ బాలీవుడ్‌లో టాప్ స్టార్ హీరోయిన్‌గా నిలవడం అనేది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ఆమె ప్రతిభ అనేది ఆమెలోని లోపంను తొక్కేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా విద్యా బాలన్ మీడియా ముందుకు వచ్చింది. తన మొదటి సినిమా రీ రిలీజ్ నేపథ్యంలో విద్యా బాలన్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
విద్యా బాలన్ మొదటి సినిమా 'పరిణీత' కి 20 ఏళ్లు
విద్యా బాలన్ బాలీవుడ్‌లో నటించిన మొదటి సినిమా 'పరిణీత' విడుదలై 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతకు ముందు ఒక సినిమా చేసినప్పటికీ అది హిందీ సినిమా కాదు. 2005లో పరిణీత సినిమాలో లలిత అనే పాత్రలో నటించడం ద్వారా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి విద్యా బాలన్ ఎదుర్కొన్న సమస్య అధిక బరువు. చాలా కాలం పాటు విద్యా బాలన్ ను సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే బరువు తగ్గాలని, సన్నగా, నాజూకుగా కనిపించాలని, అప్పుడే తక్కువ వయసు అమ్మాయిగా కనిపిస్తావని చెబుతూ ఉండే వారట. చాలా మంది దర్శకులు బరువు తగ్గమని ఏకంగా బలవంతం చేశారని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది.
షాహిద్ కపూర్‌కి జోడీగా విద్యా బాలన్
తనకంటే చిన్నవాడు అయిన షాహిద్ కపూర్‌తో కలిసి నటించేందుకు బరువు తగ్గి, తక్కువ వయసు అమ్మాయిగా కనిపించాలని దర్శకులు ఒత్తిడి చేశారట. అందుకు తగ్గట్లుగానే తాను చాలా కష్టపడి బరువు తగ్గి కొన్ని సినిమాలు చేశానని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. లావుగా ఉన్నప్పుడు సెక్సీగా ఉండే పాత్రలు చేస్తే బాగోదని చాలా మంది దర్శకులు అన్నారట. అందువల్ల తాను కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని కూడా విద్యా బాలన్ పేర్కొంది. ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగడం వెనుక తన కష్టం ఉందని పేర్కొంది. తనను నమ్మి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు ఇచ్చిన దర్శకుల వల్ల కూడా తాను ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగాను అంటూ చెప్పుకొచ్చింది. తన పరిణీత రీ రిలీజ్ గురించి పలు విషయాలను మీడియాతో విద్యా బాలన్ షేర్ చేసుకుంది.
బరువు తగ్గితేనే ఆఫర్లు
కెరీర్ ఆరంభంలో బరువు ఎక్కువగా ఉండి, వయసు ఎక్కువగా కనిపించడంతో లీడ్ రోల్స్ దక్కలేదని, తాను ఎప్పుడైతే బరువు తగ్గడం ప్రారంభించానో అప్పుడే మెయిన్ లీడ్ ఆఫర్లు వచ్చాయని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో కొందరు దర్శకులు తన పట్ల చాలా కఠినంగా వ్యవహరించి మరీ బరువు తగ్గమని చెప్పారని, బరువు తగ్గితేనే సినిమాలో ఆఫర్ అంటూ కొందరు దర్శకులు కఠిన నిబంధనలు పెట్టారని విద్యా బాలన్ ఆరోపణలు చేసింది. ఆ దర్శకులు ఎవరు అనే విషయాన్ని విద్యా బాలన్ చెప్పలేదు. కానీ వారు ఆ సమయంలో ఒత్తిడి చేసి బరువు తగ్గమని చెప్పడం వల్లే ఆఫర్లు దక్కాయని కూడా ఆమె చెప్పుకొచ్చింది.
ఇండస్ట్రీలో ఇప్పటికీ తన సత్తా చాటుతున్న విద్యా బాలన్ ముందు ముందు వరుసగా వెబ్ సిరీస్‌లను చేయాలని ఆశ పడుతున్నట్లు పేర్కొంది. గత ఏడాది రెండు సినిమాలతో వచ్చిన విద్యా బాలన్ ఈ ఏడాదిలో సినిమాలను చేయడం లేదు. ముందు ముందు ఏమైనా కమిట్ అయ్యి వచ్చే ఏడాదిలో వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తుందేమో చూడాలి. ఈ ఏడాదిలో విద్యా బాలన్ సినిమాలు లేకపోవడంతో 'పరిణీత' రీ రిలీజ్ ఆ లోటును భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి.
