MS సుబ్బులక్ష్మి సహా ఆ మూడు బయోపిక్‌లు మిస్సయ్యాను
భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ విషయంలో ప్రముఖ నటి విద్యాబాలన్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది
By: Sivaji Kontham | 16 Oct 2026 11:00 PM ISTసినీ పరిశ్రమలో కొన్ని ప్రతిష్టాత్మక పాత్రలు నటులకు డ్రీమ్ ప్రాజెక్ట్‌లుగా మిగిలిపోతుంటాయి. భారతరత్న, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ విషయంలో ప్రముఖ నటి విద్యాబాలన్‌కు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. దశాబ్ద కాలం క్రితం దర్శకుడు రాజీవ్ మీనన్ కాంబినేషన్లో ఈ సినిమా రూపుదిద్దుకోవాల్సి ఉన్నా.. అప్పట్లో కోర్టు స్టే ఆర్డర్ కారణంగా ఆగిపోయింది. చిన్నతనం నుంచే సుబ్బులక్ష్మి `సుప్రభాతం` వింటూ పెరిగిన విద్యాబాలన్‌కు ఈ డ్రీమ్ రోల్ చేజారడం ఎంతో ఆవేదనను మిగిల్చింది.
తన ఆరాధ్య గాయనిపై ఉన్న గౌరవాన్ని చాటుకునేందుకు విద్యాబాలన్ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ అను పార్థసారథి సూచనతో 2024 సెప్టెంబర్ 16న ఎం.ఎస్. సుబ్బులక్ష్మి 108వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఫోటోషూట్ చేశారు. సుబ్బులక్ష్మి గెటప్‌లో విద్యాబాలన్ చేసిన ఈ ఫోటోషూట్ సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అయింది. ఈ ఫోటోషూట్ చూసిన తర్వాత ఆమెను వెతుక్కుంటూ ఏకంగా ఏడు బయోపిక్ ఆఫర్లు రావడం గమనార్హం. అయితే చట్టపరమైన అనుమతులు పక్కాగా ఉంటేనే నటిస్తానని బాలన్ వారికి స్పష్టం చేశారు.
కేవలం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్ర మాత్రమే కాకుండా.. బాలీవుడ్ ఐకానిక్ నటి మీనా కుమారి.. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్‌లలో నటించే అవకాశాలు కూడా పలు కారణాల వల్ల చేజారిపోయాయని విద్యాబాలన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇలా మూడు ప్రతిష్టాత్మక బయోపిక్‌లు మిస్ కావడంపై ఆమె అభిమానులు కూడా నిరాశ వ్యక్తంచేశారు. ప్రస్తుతం విద్యాబాలన్ హిందీ ప్రాజెక్ట్‌లతో పాటు సూపర్‌స్టార్ రజినీకాంత్ `జైలర్ 2` చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను పలకరించారు. జైలర్ లో బాలన్ పాత్రకు అద్బుత స్పందన వచ్చింది.
మరోవైపు విద్యాబాలన్ చేజార్చుకున్న సుబ్బులక్ష్మి బయోపిక్ అవకాశం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను వరించడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. `M.S. ఏ లెగసీ ఆన్ స్క్రీన్` పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సుబ్బులక్ష్మి పాత్రను పోషించే గోల్డెన్ ఛాన్స్ రష్మికకు దక్కింది. ఇప్పటివరకు ఎక్కువగా గ్లామరస్, ఎనర్జెటిక్ పాత్రలతో అలరించిన రష్మికకు ఈ క్లాసికల్ బయోపిక్ ఓ రకంగా జాక్‌పాట్ అని.. తన కెరీర్లోనే ఇది అతిపెద్ద సవాలుతో కూడుకున్న పాత్ర అని విశ్లేషకులు భావిస్తున్నారు.
దశాబ్దాల నాటి సంగీత నేపథ్యం.. సాంప్రదాయ కట్టుబొట్టు.. భక్తిరస భావాలను ప్రతిబింబించే ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక ఎలా ఒదిగిపోతుందో చూడాలని సగటు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విద్యాబాలన్ వంటి అనుభవజ్ఞురాలైన నటి ఆశించిన ఈ ఐకానిక్ పాత్రను రష్మిక ఏ స్థాయిలో మెప్పించి వెండితెరపై ఆవిష్కరిస్తుందోనని ఇటు సౌత్.. అటు నార్త్ ఇండస్ట్రీలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
