తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?
చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టే బాధ్యత పూర్తిగా పెద్దలదేనని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అన్నారు. చైల్డ్ సేఫ్టీ వీక్ సందర్భంగా మాట్లాడిన ఆమె.. పిల్లలు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పినప్పుడు నమ్మాలని, కుటుంబ పరువు పేరుతో ఘటనలను దాచిపెట్టకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలిసిన వ్యక్తులే నేరాలకు పాల్పడినా ప్రశ్నించేందుకు వెనుకాడకూడదన్నారు. పోక్సో చట్టంపై అవగాహన పెంచి, నేరగాళ్లకు శిక్ష తప్పదనే భయం కల్పించాలని పేర్కొన్నారు. సినిమాలు చర్చకు మాత్రమే దోహదపడతాయని, బాధితులకు న్యాయం జరిగేలా క్షేత్రస్థాయిలో పనిచేయడం అందరి బాధ్యతని విద్యాబాలన్ స్పష్టం చేశారు.
By: Srikanth Kontham | 20 Nov 2026 1:53 PM ISTసమాజంలో ఎక్కడైనా చిన్నపిల్లలపై లైంగిక వేధింపుల ఘటన జరిగినప్పుడు అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆవేదన వ్యక్తం చేస్తాం. కానీ ఆ వార్త పాతబడగానే మళ్లీ ఎప్పటిలాగే మౌనంలోకి జారిపోతామన్నది అంతే నిజం. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులపై జరిగే ఇలాంటి అఘాయిత్యాలను అరికట్టే బాధ్యత పిల్లలది కాదని.. పూర్తిగా పెద్దలదేనని కుండబద్దలు కొట్టారు. 2018 నుంచి `అర్పణ్` అనే స్వచ్ఛంద సంస్థకు గుడ్‌విల్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న విద్యాబాలన్.. చైల్డ్ సేఫ్టీ వీక్ సందర్భంగా సమాజంలోని లోపాలను ఎత్తి చూపారు.
వేధింపులకు పాల్పడే వ్యక్తులు ఎవరూ పట్టుబడరనే ధీమాతోనే రెచ్చిపోతున్నారని విద్యాబాలన్ అభిప్రాయపడ్డారు. పిల్లల మౌనం.. కుటుంబ పరువు పోతుందనే పెద్దల భయం.. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సమాజం వెనుకాడే ధోరణే నేరగాళ్లకు కొండంత అండగా మారుతుందన్నారు. కఠినమైన అడుగులు వేయాల్సిన చోట పెద్దలంతా ఆగిపోతున్నారని.. మనకు ఎంతో నమ్మకమైన.. తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నామని విద్య సూటిగా ప్రశ్నించారు.
సొంత కుటుంబంలోనే కొన్ని కఠినమైన హద్దులు గీయడం.. ఒక చిన్నారి ధైర్యం చేసి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా కొట్టిపారేయకుండా నమ్మడం పెద్దల కనీస బాధ్యత అని విద్యాబాలన్ గుర్తు చేశారు. ఇంటి పరువు బజారున పడుతుందనే భయంతో నిజాన్ని నాలుగు గోడల మధ్యే సమాధి చేయడం వల్ల నేరగాళ్లకు మరింత బలం చేకూరుతుందని హెచ్చరించారు. పోక్సో చట్టం ఎంత కఠినంగా ఉందో? ప్రజల్లోకి తీసుకెళ్లి నేరం చేస్తే శిక్ష తప్పదనే భయం ప్రతి ఒక్కరిలో కలగాలన్నారు.
గతంలో తాను నటించిన `కహానీ 2` సినిమాలో దుర్గా రాణి పాత్ర చేస్తున్నప్పుడే బాలల వేధింపుల వెనుక ఉన్న చేదు నిజాలు.. బాధితులపై జీవితాంతం ఉండే మానసిక గాయాల గురించి లోతుగా అర్థమైందని విద్యాబాలన్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా విడుదలైన తర్వాతే ఇన్నాళ్లూ కార్పెట్ కింద దాచిపెట్టిన ఈ సున్నితమైన అంశంపై ఇళ్లలో చర్చ మొదలైందన్నారు. అయితే ఇలాంటి కథలను తెరకెక్కించేటప్పుడు దర్శక,నిర్మాతలు బాధితులను తప్పుపట్టకుండా.. సంచలనాల కోసం కాకుండా ఎంతో బాధ్యతగా చూపించాలని సూచించారు.
కేవలం సినిమాలు తీయడం వల్లనో? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వల్లో? చిన్నారులకు రక్షణ దక్కదని విద్యాబాలన్ తేల్చి చెప్పారు. సినిమాలు కేవలం ఒక చర్చను మాత్రమే మొదలుపెట్టగలవని ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పనిచేసే సంస్థలకు అండగా నిలవడం.. బాధితులకు న్యాయం జరిగేలా చూడటం అందరి బాధ్యత అన్నారు. ఇటీవలే విద్యాబాలన్ `జైలర్ 2` లో కాంత పాత్రతో ఎలా అలరించారో తెలిసిందే. కల్పక్ ఫ్యామిలీ వారసురాలిగా విద్య ఓ రేంజ్ లో అదరగొట్టారు. ప్రస్తుతం విద్య బాలన్ నటిస్తోన్న మరో మూడు బాలీవుడ్ చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.
