Begin typing your search above and press return to search.

అప్పట్లో ఘర్షణ.. ఇప్పుడు మళ్లీ.. ఫ్యాన్స్‌ కు రావిపూడి స్పెషల్ ట్రీట్?

ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో వెంకీ స్టైలిష్ అవతార్ లో సందడి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

By:  M Prashanth   |   25 Jun 2026 6:00 AM IST
అప్పట్లో ఘర్షణ.. ఇప్పుడు మళ్లీ.. ఫ్యాన్స్‌ కు రావిపూడి స్పెషల్ ట్రీట్?
X

విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ కు పెట్టింది పేరు. అయితే ఆయన కెరీర్‌ ను పరిశీలిస్తే కేవలం ఫ్యామిలీ హీరోగానే కాకుండా, తనదైన స్టైల్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వెంకటేష్ కొత్త లుక్‌ లో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో వెంకీ స్టైలిష్ అవతార్ లో సందడి చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్ గతంలో పలు చిత్రాల్లో ట్రెండీ లుక్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో ఆయన కనిపించిన తీరు ఇప్పటికీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. క్లాసీ హెయిర్ స్టైల్, స్టైలిష్ గాగుల్స్, ఫిట్ లుక్‌ తో వెంకీ ఆ సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే వాసు చిత్రంలో యూత్ ను ఆకట్టుకునే మోడ్రన్ స్టైల్‌ లో కనిపించి మంచి మార్కులు సాధించారు.

షాడో సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, అందులో వెంకటేష్ లుక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. విభిన్న హెయిర్ స్టైల్స్, స్టైలిష్ కాస్ట్యూమ్స్‌తో ఆయన కొత్తగా కనిపించారు. బాబు బంగారంలో కూడా యంగ్ అండ్ ఎనర్జిటిక్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇక గురు, సైంధవ్ చిత్రాల్లో సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్‌ తో క్లాస్ లుక్‌లో మెరిశారు. రానా నాయుడు వెబ్ సిరీస్‌ లో అయితే ఇప్పటివరకు చూడని బోల్డ్ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో వెంకటేష్ మరోసారి సరికొత్త గెటప్‌ లో కనిపించబోతున్నారని సమాచారం. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌ రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఆ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్ కోసం వెంకటేష్ లుక్‌ ను ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెంకీని మరింత స్టైలిష్‌ గా చూపించేందుకు మూవీ టీమ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీంతో చాలా కాలం తర్వాత మరో కొత్త యాంగిల్ లో చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. అయితే రావిపూడి సినిమాలు అంటే వినోదానికి పెద్దపీట వేస్తాయనే విషయం తెలిసిందే. ఆ చిత్రంలో కూడా కామెడీ ప్రధాన ఆకర్షణగా ఉండబోతుందని, అదే సమయంలో స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కథకు బలం చేకూరుస్తాయని టాక్ వినిపిస్తోంది.

వెంకటేష్‌ కు బాగా సెట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫార్మాట్‌ లోనే ఆ కథను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత వెంకటేష్ మరోసారి స్టైలిష్ అవతారంలో కనిపించనున్నారనే వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. కామెడీ, ఎమోషన్స్‌ తో పాటు కొత్త లుక్‌ లో వెంకీ కనిపిస్తే.. రావిపూడి మరోసారి ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.