వెంకీ.. రిస్క్ లేకుండా ఆడుతూ పాడుతూ...
గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ, 2026 లైనప్‌ను కూడా చాలా పక్కాగా, ఎక్కడా రిస్క్ లేకుండా ఆడుతూ పాడుతూ ప్లాన్ చేసుకున్నారు.
By: M Prashanth | 23 Jan 2026 4:00 AM ISTటాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా పాన్ ఇండియా గోల, వందల కోట్ల బడ్జెట్ టెన్షన్లు, ఒళ్లు హూనం చేసుకునే యాక్షన్ సీక్వెన్స్‌ల హడావుడే కనిపిస్తోంది. కానీ వీటన్నింటికీ దూరంగా, తనదైన శైలిలో కూల్‌గా ఉంటూ బాక్సాఫీస్ దగ్గర హిట్లు కొట్టడం ఒక్క విక్టరీ వెంకటేష్‌కే సాధ్యం. గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకీ, 2026 లైనప్‌ను కూడా చాలా పక్కాగా, ఎక్కడా రిస్క్ లేకుండా ఆడుతూ పాడుతూ ప్లాన్ చేసుకున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా లైనప్ చూస్తేనే మనకు ఒకటి అర్థమవుతుంది.. వెంకీ పెద్దగా కష్టపడిపోయే ప్రయోగాలు చేయడం లేదు. తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్‌నే నమ్ముకుని, బాడీ లాంగ్వేజ్‌కు సెట్ అయ్యే క్యారెక్టర్లే ఎంచుకుంటున్నారు. ఇది నిర్మాతలకు కూడా పెద్ద ప్లస్. ఎందుకంటే త్రివిక్రమ్ వెంకీ కాంబినేషన్ అంటే మినిమం గ్యారెంటీ బిజినెస్ ఉంటుంది, సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా ఈజీగా సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోతుంది.
దీని తర్వాత అనిల్ రావిపూడితో ఒక ప్రాజెక్ట్ లైన్లో ఉంది. ఇది 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్ అయినా లేదా మరో కొత్త కథ అయినా.. అది పక్కా ఎంటర్టైనర్ అనే క్లారిటీ ఉంది. అనిల్ రావిపూడితో పని చేయడం అంటే షూటింగ్‌ను పిక్నిక్‌లా ఎంజాయ్ చేయడమే. యాక్షన్ బ్లాక్స్ కోసం నెలల తరబడి కష్టపడాల్సిన అవసరం లేదు, కేవలం తన టైమింగ్‌తో మేజిక్ చేస్తే చాలు. అందుకే ఈ కాంబినేషన్‌ను కూడా వెంకీ ఒక సేఫ్ బెట్ లాగే చూస్తున్నారు.
ఇక అందరూ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 'దృశ్యం 3' పై కూడా సురేష్ బాబు క్లారిటీ ఇచ్చేశారు. అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది థ్రిల్లర్ అయినప్పటికీ, షూటింగ్ పరంగా వెంకీకి పెద్దగా ఫిజికల్ స్ట్రెయిన్ ఉండదు. పైగా ఆల్రెడీ రెండు పార్టులు సూపర్ హిట్ అయ్యాయి కాబట్టి, మూడో పార్ట్‌కు ఓపెనింగ్స్ పరంగా అస్సలు టెన్షన్ ఉండదు. ఇలా ఒకదాని వెనుక ఒకటి కాంబినేషన్స్ మరియు సీక్వెల్స్‌తో వెంకీ తన మార్కెట్‌ను చాలా సేఫ్‌గా హ్యాండిల్ చేస్తున్నారు.
వెంకటేష్ లైనప్ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది.. ఆయన ప్రయోగాలు చేసి ఆడియన్స్‌ను మెప్పించాలనే హడావుడిలో లేరు. తనకు ఏది సూట్ అవుతుందో, ప్రేక్షకులు తన నుండి ఏం కోరుకుంటున్నారో అది మాత్రమే ఇస్తున్నారు. అందుకే షూటింగ్స్ కూడా చాలా స్మూత్‌గా, టెన్షన్ లేకుండా జరిగిపోతున్నాయి. హీరోలందరూ హై వోల్టేజ్ యాక్షన్ అంటూ రిస్క్ చేస్తుంటే, వెంకీ మాత్రం ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ బాక్సాఫీస్ దగ్గర లాభాలు చూస్తున్నారు.
