విక్టరీ వెంకటేష్ మళ్లీ యాక్షన్ మోడ్ లోకా?
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
By: Srikanth Kontham | 25 Aug 2026 8:45 AM ISTక్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు కుటుంబ కథా చిత్రాలు, మరోవైపు విభిన్న జోనర్స్ చేస్తూనే తనలోని నటుడిని సంతృప్తి పరిచే సరికొత్త కథల కోసం ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్లతో ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టిన వెంకీ అనూహ్యంగా ఓ భారీ యాక్షన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ట్రెండ్‌కు తగినట్లుగా శైలిని మార్చుకుంటున్న వెంకటేష్ కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా వైవిధ్యమైన యాక్షన్ ఎంటర్‌టైనర్ల వైపు అడుగులు వేస్తుంటారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ల తర్వాత వెంకీ చేయబోయే తదుపరి సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఓ యువ దర్శకుడు చెప్పిన పవర్ ఫుల్ యాక్షన్ లైన్ వెంకటేష్‌ను ఎంతగానో ఆకట్టుకుందని తెలిసింది.
ఆ యువ దర్శకుడు వినిపించిన కథాంశం యాక్షన్ సీక్వెన్స్‌లకే పరిమితం కాకుండా బలమైన భావోద్వేగాలతో కూడిన రస్టిక్ యాక్షన్ జోనర్‌లో సాగుతుందని సమాచారం. వెంకటేష్ కేరీర్‌లో ఎప్పుడూ చూడని సరికొత్త కోణంలో ఈ పాత్ర ఉండబోతుందట. కథలోని ఆత్మను, అందులోని ముడిపడిన ఎమోషన్స్‌ను అర్థం చేసుకున్న వెంకీ, వెంటనే ఆ లైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుట. పూర్తి స్క్రిప్ట్‌ను డెవలప్ చేయమని యంగ్ డైరెక్టర్‌కు సూచించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
తాజా చిత్రం మాత్రం సరికొత్త పంథాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. యువ దర్శకుల ఆలోచనలకు పెద్దపీట వేస్తూ కంటెంట్ బలంగా ఉంటే ఎలాంటి సాహసానికైనా సిద్ధపడే వెంకటేష్.. ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ప్రస్తుతం సీనియర్ హీరోలు కూడా యువ దర్శకులతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కోవలోనే వెంకటేష్ కూడా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్‌తో జట్టుకట్టనుండటం అభిమానులకు పెద్ద పండగ లాంటి వార్తే అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లు పూర్తికాగానే భారీ యాక్షన్ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. కొంత కాలంగా వెంకీ కూడా ఫ్యామిలీ కామెడీ సినిమాలకే పరిమితమయ్యారు. ఈనేపథ్యంలో బోర్ కొట్టిన వెంకీ యాక్షన్ కథ వైపు మళ్లుతున్నట్లు కనిపిస్తోంది.
