Begin typing your search above and press return to search.

రవి వర్మకే అందని ఒకే ఒక అందం !

ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ అన్నది తెలిసిందే. ఆయన్ని ఆధునిక భారతీయ చిత్ర కళా పితామహుడిగా కీర్తిస్తారు.

By:  Satya P   |   30 Jun 2026 9:27 AM IST
రవి వర్మకే అందని ఒకే ఒక అందం !
X

ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు రాజా రవివర్మ అన్నది తెలిసిందే. ఆయన్ని ఆధునిక భారతీయ చిత్ర కళా పితామహుడిగా కీర్తిస్తారు. ఆయన గీసిన చిత్రం చూస్తే చాలు స్త్రీ మూర్తి అందమేంటో తెలుస్తుంది. కొత్త అందాలు ఆయన చిత్రంలో చోటు చేసుకుంటాయి. 18వ శతాబ్దానికి చెందిన రవివర్మను మహా కవి వేటూరి సుందర రామమూర్తి తన సినీ గీతం ద్వారా సామాన్య జనాలకు మరోసారి పరిచయం చేశారు. ఆయన ఎందుకు రవివర్మను తలచుకున్నారు అంటే ఒక సినీ గీతంలో హీరోయిన్ అందాన్ని అభివర్ణించడం కోసం దాసరి నారాయణరావు అక్కినేని కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం దేవదాస్ మళ్ళీ పుట్టాడు, ఇది 1978లో రిలీజ్ అయింది. ఆ తరువాత 1979లో వచ్చిన రెండవ చిత్రం రావణుడే రాముడైతే. అవుట్ అండ్ అవుట్ మాస్ హీరోగా అక్కినేనిని ఈ మూవీలో దాసరి చూపించారు. ఇక ఆయనకు జయచిత్ర తో కలిపి ఈ సినిమాలో రొమాంటిక్ సాంగ్ రాయమంటే వేటూరి వారి కలం ఏకంగా రవి వర్మ దాకా వెళ్ళి వచ్చింది.

అద్భుత చిత్రీకరణతో :

ఈ సినిమాలో జయచిత్రను అక్కినేని ప్రేమిస్తాడు. అది వన్ సైడ్ లవ్. అలా ఆమెను ఊహించుకుని ఆయన పాడే కలల గీతమే రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో. ఈ మూవీలో హీరో కూడా పెయింటర్ కావడం కూడా వేటూరి వారికి రవి వర్మ ప్రస్తావన చేయడానికి సహకరించింది. ఇక రవివర్మ సౌందర్యరాశులు ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. జయచిత్ర అప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవా చాటుకుంటున్న నేపథ్యం ఉంది. అక్కినేనితో ఆమె అంతకు ముందే ఆత్మీయుడు మూవీలో హీరోయిన్ గా చేసింది. అయితే ఈ మూవీలో జయచిత్రను అందంగా చూపించడానికి దాసరి చేసిన ప్రయత్నానికి వేటూరి వారి సాహిత్యం ఎంతగానో హెల్ప్ చేసింది అని చెప్పాలి.

కవితా నీరాజనం :

వేటూరి వారు పండితుడు. సకల సాహిత్యాన్ని ఔపాసన పట్టిన వారు. అందుకే ఆయన రవివర్మ వంటి చిత్రకారుడిని ఎత్తుకుని మరీ హీరోయిన్ అందాన్ని అభివర్ణించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాదు దానికి జీకే వెంకటేష్ అందించిన సంగీతం ఎస్పీ బాలు రసరమ్యంగా పాడిన విధానం ఆ పాటను యాభై ఏళ్ళకు దగ్గర పడినా శాశ్వతత్వం సంపాదించి పెట్టాయని చెప్పాలి. సాధారణంగా హీరోయిన్ల అందాలను వర్ణించే ఎన్నో గీతాలను కవులు రాస్తారు. కానీ చాలా అరుదుగా మరీ అతిశయోక్తిగా అనిపించకుండా ఇంతలా కూడా రాయవచ్చునా అనిపించేలా ఏర్చి కూర్చి అందించిన సాహిత్యమే వేటూరి వారిది. నిజంగా అతి తక్కువ మంది హీరోయిన్లకు ఇలాంటి కవితా నీరాజనం అన్నది దక్కుతుంది. జయచిత్ర విషయంలో అదే జరిగింది. ఆమె ఎన్ని సినిమాల్లో నటించినా ఆమె మీద ఎన్ని పాటలు చిత్రీకరించబడినా కానీ రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో అంటే మాత్రం జయచిత్ర అలా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ సాహిత్యంతో వేటూరి చేసిన మ్యాజిక్ కూడా అందరికీ గుర్తుకు వస్తుంది. సినిమాలో పాత్ర ఔచిత్యం సంగతి పక్కన పెడితే ఒక కమర్షియల్ మూవీలో ఒక మాస్ అప్పీల్ ఉన్న పాత్రల మధ్య ఇంత క్లాసిక్ సాంగ్ ని వేటూరి రాయడం దానిని అంతే అద్భుతంగా షూట్ చేసి దాసరి తన అభిరుచిని చాటుకోవడం అన్నది సినీ ప్రేమికులకు ఎవర్ గ్రీన్ గిఫ్ట్ గా మారింది అని చెప్పాలి.