చిరు అచ్చా అచ్చా సాంగ్.. ఒక్కో 'చ'కి వెయ్యి.. అసలు కథ ఇదే!
చిరంజీవి రాక్షసుడు సినిమాలోని అచ్చా అచ్చా పాటను.. నాలుగున్నర నిమిషాల నిడివితో ఐదు నిమిషాల్లోనే రాసి శభాష్ అనిపించుకున్నారు.
By: Madhu Reddy | 28 Aug 2025 11:00 PM ISTచిత్రరంగంలో అటు దర్శకులు.. ఇటు సాహిత్యకారులు ఏదో ఒక నిజ జీవిత సంఘటనను దృష్టిలో పెట్టుకొని అటు కథలను ఇటు పాటలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా నిజజీవితంలో జరిగే విషయాలను అటు పాటల రూపంలో కూడా తెరకెక్కించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. వాస్తవికతకు అద్దం పట్టేలా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రచయితలలో.. పాటల రచయిత వేటూరి కూడా ఒకరు. ఎన్నో అద్భుతమైన పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించి.. వారి హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. అలా ఈయాన సాహిత్యం అందించిన పాటలలో భారీ పాపులారిటీ అందుకున్న అచ్చా అచ్చా పాట కూడా ఒకటి.
చిరంజీవి రాక్షసుడు సినిమాలోని అచ్చా అచ్చా పాటను.. నాలుగున్నర నిమిషాల నిడివితో ఐదు నిమిషాల్లోనే రాసి శభాష్ అనిపించుకున్నారు. అయితే ఈ పాట అప్పట్లో ఏ రేంజ్ లో సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిర్మాత కె ఎస్ రామారావు నిర్మాణంలో చిరంజీవి హీరోగా.. రాధా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ పాట ఎవర్గ్రీన్ సాంగ్ గా నిలిచిపోయింది. అయితే ఈ పాట పుట్టుకకు ఒక కారణం ఉందని దీని వెనుక అటు వేటూరికి భారీ ఆదాయం వచ్చింది అని సమాచారం.
అసలు విషయంలోకి వెళ్తే.. 1986లో రాక్షసుడు సినిమా షూటింగ్ జరుగుతోంది. అరేయ్ బచ్చా అంటూ కో డైరెక్టర్ ఎవరి పైనో సీరియస్ అవుతున్నారు. చ్చా ప్రాసతో కూడిన ఆ కో డైరెక్టర్ మాటలు నిర్మాత కె ఎస్ రామారావు చెవిన పడగా.. వెంటనే వేటూరిని కలిసి ఆయన చ్చా శబ్దం వచ్చేలా ఒక పాటను రాయాలి అని.. ఆ పాటలో ఎన్ని 'చ్చా' లు ఉంటే అన్నింటికీ ఒక్కొక్క దానికి ₹1000 ఇస్తానని ఆఫర్ చేశారట. అలా కేఎస్ రామారావు ఇచ్చిన ఆఫర్ ను అందిపుచ్చుకొని పాట రాయడం మొదలుపెట్టారు వేటూరి..
అలా.." అచ్చా అచ్చా వచ్చా వచ్చా.. నిండు జాబిల్లికైనా ఉందీ మచ్చా.. నీకు లేనందుకే నే మెచ్చా.. మోజులన్నీ మోసుకొచ్చా.. ఈడు జోడు రంగరించా" అంటూ ఈ పాటను చాలా అద్భుతంగా రూపొందించారు.. దీంతో నిర్మాత కూడా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈ పాటలో మొత్తం 50 'చ'కారాలు ఉండడం గమనార్హం. సాధారణంగా ఆ సమయంలో వేటూరి ఒక్కో పాటకు కేవలం రూ.2000 వరకు పారితోషకం తీసుకునేవారు. కానీ ఈ పాటకు ఏకంగా రూ.50,000 తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు ఆయన కెరియర్లో అదే అతిపెద్ద రెమ్యూనరేషన్ కూడా కావడం గమనార్హం.
ఇళయరాజా సంగీతంలో.. వేటూరి సాహిత్యానికి.. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఎస్ జానకి గానం తోడై.. చిరంజీవి - రాధ స్టెప్ లకు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచింది ఈ పాట.
