వెట్రిమారన్‌పై విరుచుకుపడుతున్నారు
దురంధర్ సినిమా పేరెత్తకుండానే ఆ చిత్రాన్ని ప్రాపగండా ఫిలిం అంటూ తమిళ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల ఒక తమిళ సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
By: Garuda Media | 30 March 2026 7:00 PM ISTదురంధర్ సినిమా పేరెత్తకుండానే ఆ చిత్రాన్ని ప్రాపగండా ఫిలిం అంటూ తమిళ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ ఇటీవల ఒక తమిళ సినిమా వేడుకలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఫేక్ కరెన్సీ మాఫియాకు చెక్ పెట్టడం కోసమే మోడీ ప్రభుత్వం డీమానిటైజేషన్ నిర్ణయం తీసుకున్నట్లుగా దురంధర్-2 చిత్రంలో చూపించగా.. దాన్ని తప్పుబడుతూ వెట్రిమారన్ వ్యాఖ్యలు చేశాడు. ఐతే బీజేపీకి అనుకూలంగా సినిమాలు తీస్తే మాత్రమే ప్రాపగండానా.. మరి మిగతా దర్శకులు, ముఖ్యంగా తమిళ డైరెక్టర్లు తీసే సినిమాల మాటేంటి అంటూ వెట్రిమారన్ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వెట్రిమారన్ సినిమాలు కూడా ప్రాపగండానే అంటూ విడుదల, విడుదల-2 చిత్రాల్లో నక్సలైట్లను హీరోలుగా చూపించడాన్ని తప్పుబడుతున్నారు. ఇక తమిళంలో కొన్ని కులాలు, మతాలకు అనుకూలంగా.. కొన్ని కులాలు, మతాలను బ్యాడ్ లైట్లో చూపిస్తూ తీసే సినిమాల సంగతేంటి అని కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
కొన్ని నెలల కిందటే తమిళంలో సిరాయ్ అనే సినిమా వచ్చింది. అది ఒక నిజ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా. ఐతే వాస్తవంగా బాధితుడు హిందువైతే.. సినిమాలో మాత్రం ఆ కుర్రాడిని ముస్లింగా చూపించారు. ఈ విషయాన్ని స్వయంగా కథా రచయితే అయిన నటుడు తమిళ్ వెల్లడించాడు. ఇక కొన్నేళ్ల ముందు ఈ తమిళ్ అనే నటుడు జై భీమ్ సినిమాలో కర్కోటకుడైన పోలీస్ ఆఫీసర్ పాత్ర చేశాడు. ఆ సినిమా కూడా వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కిందే. నిజానికి ఆ పోలీస్ అధికారి క్రిస్టియన్. కానీ సినిమాలో మాత్రం ఆ పాత్రను హిందువుగా చూపించారు. ఇలా తమిళంలో వాస్తవాలను వక్రీకరించి.. హిందువులను బ్యాడ్ లైట్లో చూపించే సినిమాలు కోకొల్లలు. అక్కడ కుల వివక్ష మీద ఎన్నో ఏళ్ల నుంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. అదే ఒక ట్రెండుగా మారిపోయింది. కొన్ని కులాల మీద సానుభూతి కోసం కొన్ని కులాలను చెడుగా చూపించడం అక్కడి దర్శక నిర్మాతలకు అలవాటైపోయింది. ఇదంతా ప్రాపగండా కాదా అంటూ వెట్రిమారన్ మీద విరుచుకు పడుతున్నారు నెటిజన్లు. అప్రెషన్ సినిమాలతో ఒక మూసలో పడిపోయి తమిళ సినిమా పరిధి అంతకంతకూ కుచించుకుపోతుండగా.. దురంధర్ లాంటి సినిమాలు భారీ వసూళ్లు సాధించడం తట్టుకోలేకే వెట్రిమారన్ లాంటి వాళ్లు విషం కక్కుతున్నారంటూ అతడిపై విరుచుకుపడుతున్నారు దురంధర్ మద్దతుదారులు.
