కన్నుమూసిన ప్రముఖ నటుడు జీ.వి.నారాయణ.. ఆయన నటించిన చివరి తెలుగు చిత్రం ఏంటంటే?
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీ.వి. నారాయణరావు (73) కన్నుమూశారు.
By: Madhu Reddy | 27 Aug 2026 10:54 AM ISTతెలుగు సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీ.వి. నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు.ఈ విషయాన్ని నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నారాయణరావు మృతి పట్ల సినీ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మరియు అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు..
తొలి సినిమాకే నంది పురస్కారం:
1953లో జన్మించిన జీ.వి. నారాయణరావు బాల్యం, చదువు గుంతకల్లు, హైదరాబాద్‌లలో సాగాయి. 1976లో లెజెండరీ డైరెక్టర్‘అంతులేని కథ’ చిత్రంతో ఆయన నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో 'తాళికట్టు శుభవేళ' పాటతో పాటు ఆయన కనబరిచిన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మొదటి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా ప్రతిష్టాత్మక నంది అవార్డును అందుకోవడం విశేషం.
రజనీకాంత్, చిరంజీవులతో అనుబంధం:
మద్రాస్ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 1973లో ప్రారంభమైన ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదటి బ్యాచ్‌లో నారాయణరావు శిక్షణ పొందారు. అక్కడ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆయనకు బ్యాచ్‌మేట్ కావడంతో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అలాగే మెగాస్టార్ చిరంజీవితోనూ ఆయనకు మంచి అనుబంధం ఉండేది. 'ఒక ఊరి కథ', 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ' చిత్రాల్లో హీరోగా నటించినా, ఆ తర్వాత సహాయ నటుడిగా రాణించారు.
వందకు పైగా చిత్రాలు.. క్రేజీ రోల్స్:
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో సుమారు 100కు పైగా చిత్రాలలో జీవీ నారాయణరావు నటించారు. 'చిలకమ్మ చెప్పింది', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు. వెండితెరపైనే కాకుండా పలు ప్రముఖ టీవీ సీరియల్స్‌లో కూడా నటించి బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.
జీవీ నారాయణరావు నటించిన చివరి చిత్రం:
కెరీర్ చివరి దశలో సినిమాల కంటే ఎక్కువగా టెలివిజన్ ధారావాహికలకే ప్రాధాన్యమిచ్చిన ఆయన, చివరిగా 2021లో వచ్చిన 'స్కైలాబ్' చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో నటించి అలరించారు. జీవిత చరమాంకం వరకు నటనపై ఉన్న మక్కువతో సీరియల్స్, సినిమాల్లో కొనసాగడం విశేషం.
తీరని లోటు:
నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన జీ.వి. నారాయణరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ టాలీవుడ్ వర్గాలు నివాళులు అర్పిస్తున్నాయి..
