అంకె మాత్రమే 60..స్పీడు మాత్రం 100!
ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో 60 ఏళ్లు దాటాయంటే హీరోలు రిటైర్మెంట్ గురించి ఆలోచించేవారు లేదా క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమయ్యేవారు.
By: Srikanth Kontham | 9 April 2026 11:25 AM ISTఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో 60 ఏళ్లు దాటాయంటే హీరోలు రిటైర్మెంట్ గురించి ఆలోచించేవారు లేదా క్యారెక్టర్ రోల్స్‌కు పరిమితమయ్యేవారు. కానీ ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే సీనియర్ హీరోలే బాక్సాఫీస్ వద్ద అసలైన జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ నుంచి కోలీవుడ్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ వరకు అందరూ యంగ్ హీరోలకు సవాల్ విసిరేలా వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. వీరి ఉత్సాహం, పని పట్ల ఉన్న అంకితభావం చూస్తుంటే వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మునుపెన్నడూ లేనంత వేగంగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన సోషియో ఫాంటసీ చిత్రం `విశ్వంభర` పనుల్లో నిమగ్నమైన సంగతి తెలిసిందే. అది పూర్తి కాకముందే దర్శకుడు బాబీతో మరో భారీ ప్రాజెక్టును ఖరారు చేశారు. తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ ఉండే కథలను ఎంచుకుంటూ, యంగ్ డైరెక్టర్లకు అవకాశాలిస్తూ చిరంజీవి తన వింటేజ్ గ్రేస్‌ను మళ్లీ చూపిస్తున్నారు. ఆయన ఎనర్జీ చూసి మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నారు.
వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. `అఖండ`, `వీరసింహారెడ్డి` వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకుల్లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకున్న ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని చాటుకుం టున్నారు. కేవలం సినిమాలే కాకుండా టాక్ షోలతోనూ ఆయన బిజీగా గడపడం విశేషం. సూపర్ స్టార్ రజనీకాంత్ వేగం గురించి ఎంత చెప్పినా తక్కువే. `జైలర్` సినిమాతో ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్‌ను షేక్ చేసిన తలైవా ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా `జైలర్ 2` పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
70 ఏళ్లు పైబడినప్పటికీ ఆయనలో ఉన్న స్వాగ్ , స్క్రీన్ ప్రెజెన్స్ నేటి తరం హీరోలకు సైతం సాధ్యం కావడం లేదు. రజనీకాంత్ తన స్టైల్‌తో గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తూ తదుపరి చిత్రాల కోసం భారీ లైనప్‌ను సిద్ధం చేసుకుం టున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్థానం వీటన్నిటికి భిన్నంగా సాగుతోంది. ఆయన కేవలం నటుడిగానే కాక నిర్మాతగా కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. `కల్కి 2` వంటి భారీ చిత్రాల్లో నటిస్తూనే సొంత నిర్మాణ సంస్థలో యువ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. నటన, నిర్మాణం , రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ కమల్ చూపిస్తున్న మల్టీ టాస్కింగ్ నైపుణ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక వైపు వైవిధ్యమైన పాత్రలు, మరోవైపు కమర్షియల్ సక్సెస్‌లను ఆయన సమానంగా బ్యాలెన్స్ చేస్తున్నారు.
మొత్తానికి దక్షిణాది సినీ సామ్రాజ్యాన్ని ఏలుతోన్న సీనియర్ హీరోలు తమ అనుభవం, క్రమశిక్షణతో పరిశ్రమకు పెద్ద దిక్కుగా నిలుస్తున్నారు. వీరి వల్ల థియేటర్ల బిజినెస్ నిలకడగా ఉంటుంది. వేల మంది సినీ కార్మికులకు పని దొరుకుతోంది. యంగ్ హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడానికి తడబతున్న తరుణంలో 60 ప్లస్ హీరోలు చూపిస్తున్న జోరు రాబోయే తరానికి గొప్ప పాఠం అని చెప్పక తప్పదు.
