Begin typing your search above and press return to search.

6000 పాటలు పాడిన మేటి గాయని జమునా రాణికి తుది వీడ్కోలు

తెలుగు వెండితెరపై జానపద, మధురమైన బాణీలతో ఎన్నో తరాల శ్రోతలను మైమరిపించిన జమునా రాణి కన్నుమూసిన వార్త సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది.

By:  Sivaji Kontham   |   1 Aug 2026 1:29 PM IST
6000 పాటలు పాడిన మేటి గాయని జమునా రాణికి తుది వీడ్కోలు
X

తెలుగు వెండితెరపై జానపద, మధురమైన బాణీలతో ఎన్నో తరాల శ్రోతలను మైమరిపించిన జమునా రాణి కన్నుమూసిన వార్త సంగీత ప్రపంచాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఏడేళ్ల చిన్ననాటి వయసులోనే 'త్యాగయ్య' చిత్రంతో తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించి, 'దేవదాసు'లోని ''ఓ దేవదా.. చదువు ఇదేనా'' వంటి చిరస్మరణీయమైన ఆల్ టైమ్ హిట్ పాటలను మనకందించిన ఈ గానకోకిల ఆఖరి ప్రయాణం బెంగళూరులో పూర్తయింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ భాషల్లో దాదాపు 6 వేలకు పైగా పాటలు పాడి, ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, సావిత్రి వంటి మహానటుల స్వర్ణయుగ చిత్రాలకు అద్భుతమైన గళాన్ని అందించిన ఈ మహోన్నత గాయని నిష్క్రమణ భారతీయ సంగీత లోకానికి తీరని లోటు.

అయితే, 6000 పాటలతో కోట్లాదిమంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ లెజెండరీ గాయని నిష్క్రమణ అభిమానుల‌ను క‌ల‌చివేస్తోంది. జమునా రాణి జీవితాంతం బ్రహ్మచారిణిగానే ఉండిపోవడంతో.. కడసారి వీడ్కోలు కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు మాత్రమే పాల్గొన్నారు. టాలీవుడ్ నుంచి సరైన నివాళులు దక్కకపోవడం వేరే అంశం. ఒకరిద్దరు సినీ ప్రముఖులు మినహా, పరిశ్రమకు చెందిన పెద్దగా ఎవరూ హాజరుకాకపోవడం నిరాశ పరిచింది.

శతాబ్దాల నాటి సినీ సంగీత స్వర్ణయుగానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఆమె మరణం దక్షిణాది సంగీత ప్రపంచానికి తీరని లోటును మిగిల్చింది. సంగీత రంగంలో ఆమె అందించిన విశేష సేవలకు గాను తమిళనాడు ప్రభుత్వం 1998లో 'కళైమామణి' పురస్కారంతో, 2002లో `అరిజ్ఞర్ అన్నా` పురస్కారంతో గౌరవించింది.

గాయకులు టీ.ఎం. సౌందరరాజన్, సీర్కాళి గోవిందరాజన్, తిరుచ్చి లోగనాథన్, పి.బి. శ్రీనివాస్, ఏ.ఎం. రాజా, పి. సుశీల, పి. లీల, ఎల్.ఆర్. ఈశ్వరి, జిక్కి, ఎస్. జానకి, శూలమంగళం రాజలక్ష్మి, ఎం.ఎస్. రాజేశ్వరి వంటి ప్రముఖులతో పాటు, సంగీత దిగ్గజాలు విశ్వనాథన్-రామమూర్తి, కె.వి. మహదేవన్, టి.ఆర్. పాప, వి. కుమార్, జి.కె. వెంకటేష్, ఇళయరాజా వంటి వారితో కలిసి పనిచేసిన అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంగీతాభిమానులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

తన ఏడేళ్ల వయసు నుంచి చివరిగా `మిథునం` సినిమా వరకు తన అమృత గాత్రంతో అలరించిన జమునా రాణి పేరు, ఈ వెట‌ర‌న్ గాయ‌ని జానపద - క్లాసికల్ పాటలు తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచే ఉంటాయి. దిగ్గజ గాయని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.