Begin typing your search above and press return to search.

తమిళ చిత్రసీమకు తీరని లోటు.. దర్శక దిగ్గజం కె. భాగ్యరాజ్ కన్నుమూత

ప్రముఖ సినీ దిగ్గజం కె. భాగ్యరాజ్ 73 ఏళ్ల వయసులో శనివారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   27 Jun 2026 12:40 PM IST
తమిళ చిత్రసీమకు తీరని లోటు.. దర్శక దిగ్గజం కె. భాగ్యరాజ్ కన్నుమూత
X

తమిళ సినీ పరిశ్రమలో కథా రచయితగా, దర్శకుడిగా, నటుడిగా చెరగని ముద్ర వేసిన ప్రముఖ సినీ దిగ్గజం కె. భాగ్యరాజ్ 73 ఏళ్ల వయసులో శనివారం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. దశాబ్దాల పాటు తన ప్రత్యేకమైన కథలతో, కుటుంబ విలువలను ప్రతిబింబించే సినిమాలతో ప్రేక్షకులను అలరించిన భాగ్యరాజ్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

కె. భాగ్యరాజ్‌కు భార్య, ప్రముఖ నటి పూర్ణిమ భాగ్యరాజ్, కుమారుడు నటుడు శాంతను భాగ్యరాజ్, కుమార్తె శరణ్య భాగ్యరాజ్ ఉన్నారు. ఇటీవల వరకు ఆయన ప్రజా జీవితంలో యాక్టివ్ గా కొనసాగారు. రీసెంట్ గా నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కూతురి పెళ్లి వేడుకల్లో పాల్గొని అందరితో ఆప్యాయంగా మమేకమయ్యారు. ఇంతలోనే ఆయన మరణ వార్త సినీ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో కృష్ణస్వామి భాగ్యరాజ్‌గా జన్మించిన ఆయన, తన సినీ కెరీర్ ను ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి తన టాలెంట్ తో డైరెక్టర్ గా, రైటర్ గా ఎదిగి తమిళ చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల ఎమోషన్స్, సామాజిక అంశాలు, సహజమైన పాత్రలతో కూడిన కథలను తెరపై ఆవిష్కరించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉండేది.

1980, 1990 దశకాల్లో తమిళ సినిమాకు ఆయన అందించిన కథలు, స్క్రీన్‌ప్లేలు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. డైరెక్టర్ గా 25కి పైగా సినిమాలకి దర్శకత్వం వహించిన భాగ్యరాజ్, నటుడిగా 75కు పైగా సినిమాల్లో నటించి బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. ఆయన రచనల్లో కనిపించే భావోద్వేగం, హాస్యం, కుటుంబ బంధాల చిత్రణ ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉన్నాయి.

ఆయన దర్శకత్వంలో వచ్చిన ముందానై ముడిచ్చు, అంధా 7 నాట్కల్, డార్లింగ్.. డార్లింగ్.. డార్లింగ్ వంటి సినిమాలు కోలీవుడ్ లో క్లాసిక్ సినిమాలుగా నిలిచాయి. కథనాన్ని ఆసక్తికరంగా మలచడంలో భాగ్యరాజ్‌కు ఉన్న నైపుణ్యం కారణంగా ఆయనను తమిళ సినీ పరిశ్రమలో అత్యుత్తమ స్క్రీన్‌రైటర్లలో ఒకరిగా భావిస్తారు. భాగ్యరాజ్ టాలెంట్ ను అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, సినీ దిగ్గజం ఎంజీఆర్ కూడా బహిరంగంగా ప్రశంసించారు. సినీ రంగంలో తన వారసుడిగా అభివర్ణించడం ఆయనకు లభించిన అత్యున్నత గౌరవాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అంతేకాదు తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో కూడా భాగ్యరాజ్ తనదైన ముద్ర వేశారు. అమితాబ్ బచ్చన్ ద్విపాత్రాభినయం చేసిన ఆఖ్రీ రాస్తా సినిమాకి ఆయన దర్శకత్వం వహించగా, ఆ సినిమా కమర్షియల్ గానే కాక విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీంతో ఆయన టాలెంట్ దక్షిణాదికే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

భాగ్యరాజ్ మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప కథకుడిని కోల్పోయింది. ఆయన రూపొందించిన సినిమాలు, రచనలు, తెరపై ఆవిష్కరించిన పాత్రలు తరతరాల ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.