క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ సడెన్ గా మాయమవ్వడం వెనక కారణం?
దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ చిత్రం `లక్కీ భాస్కర్`లో సుధ ఒక చిన్న సపోర్టింగ్ రోల్‌లో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించారు.
By: Sivaji Kontham | 23 Jun 2026 7:00 AM ISTటాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర హీరోలందరికీ సోదరిగా, ఆప్యాయతను పంచే మాతృమూర్తిగా కీలకమైన పాత్రలు పోషించి మెప్పించిన సీనియర్ నటి సుధ (హేమ సుధ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. `క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే సుధలా ఉండాలి!` అనేంతగా ఆమె తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ప్రతి తెలుగు ఇంట్లోనూ ఇలాంటి ఒక వ్యక్తి ఉంటారని అభిమానంగా చెప్పుకునేలా సంప్రదాయబద్ధమైన పాత్రల్లో అలరించిన ఈ వెటరన్ నటి సడెన్‌గా వెండితెరపై కనిపించకుండా పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడులోని శ్రీరంగంలో పుట్టి పెరిగిన సుధ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అకస్మాత్తుగా సినిమాల్లో కనిపించకపోవడం వెనుక ఉన్న కారణాలపై ఇటీవల సోషల్ మీడియాల్లో చర్చ సాగుతోంది.
ఈ చర్చలో నెటిజన్లు ప్రధానంగా ప్రస్తావించిన అంశం క్యారెక్టర్ రోల్స్‌లో వచ్చిన మార్పులు.. సరైన కంటెంట్ లేకపోవడం ప్రధాన కారణం. కెరీర్‌లో సుధ వరుసగా ఒకే రకమైన సాఫ్ట్ మదర్ క్యారెక్టర్లు చేయడం వల్ల ప్రేక్షకుల్లో ఒక రకమైన విసుగు వచ్చిందని కొందరు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు... ఒక ఇంటర్వ్యూలో తనే స్వయంగా చెప్పినట్లు.. ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్లకు సరైన ప్రాధాన్యత, ప్రాణం ఉండటం లేదు. కథల్లో అమ్మ, నాన్న పాత్రలను కేవలం నామమాత్రంగానే వాడుకుంటుండటం వల్ల.. ప్రాధాన్యత లేని పాత్రలు చేయడం ఇష్టం లేకే సినిమాలను తగ్గించుకున్నారని నెటిజన్లు గుర్తుచేశారు.
పరిశ్రమలో కొత్త నటీమణుల ఎంట్రీ.. ట్రెండ్ షిఫ్ట్ కూడా సుధకు అవకాశాలు తగ్గడానికి మరో ప్రధాన కారణం. ఒకప్పుడు సుధ చేసిన తరహా పాత్రల్లోకి తులసి, రోహిణి, పవిత్ర లోకేష్, సితార, ఇంద్రజ వంటి నటీమణులు రీప్లేస్ చేసారు. వీరికి తోడు ఒకప్పటి స్టార్ హీరోయిన్లు అయిన నదియా, ఖుష్బూ, కాజోల్ వంటి వారు సరికొత్త గ్లామరస్, పవర్‌ఫుల్ లేదా మోడ్రన్ మాతృమూర్తి పాత్రల్లోకి మారి టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వడంతో పాతతరం హోమ్‌మేకర్ పాత్రల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయని నెటిజన్లు విశ్లేషించారు.
మారుతున్న సినిమా జానర్స్ కూడా దీనికి ఒక బలమైన కారణం. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు, గ్లోబల్ లెవెల్ యాక్షన్ డ్రామాలు, మాస్ మసాలా- విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆధారిత చిత్రాల ట్రెండ్ నడుస్తోంది. ఇలాంటి హై-వోల్టేజ్ కథల్లో పాతకాలపు ఎమోషనల్ సెంటిమెంట్‌తో కూడిన తల్లి పాత్రలకు స్కోప్ చాలా తక్కువగా ఉంటోంది. దీనికి తోడు నటి సుధకు వయసు పైబడటం.. కొన్ని వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కారణంగానే ప్రస్తుతం సినిమాల నుండి కాస్త బ్రేక్ తీసుకుని.. చెన్నైలో ప్రశాంతంగా తన ఫ్యామిలీతో కాలం గడుపుతున్నారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.
దుల్కర్ సల్మాన్ సూపర్ హిట్ చిత్రం `లక్కీ భాస్కర్`లో సుధ ఒక చిన్న సపోర్టింగ్ రోల్‌లో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించారు. ఇంకా నటి సుధలో నటించే పనితనం ఉంది. దానిని సద్వినియోగం చేయాలని తన అభిమానులు ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన సీనియర్ నటీమణుల కోసం మంచి పాత్రలను డిజైన్ చేయాలని... వారు తమ నటనతో సినిమాలకు మరింత నిండుదనం తీసుకురాగలరని నెటిజన్లు కోరుకున్నారు.
