Begin typing your search above and press return to search.

నారాయణరావు హీరో...చిరంజీవి విలన్ !

టాలీవుడ్ సీనియర్ నటుడు పాత తరం హీరో జీవీ నారాయణరావు కన్ను మూసిన సంగతి తెలిసిందే.

By:  Satya P   |   28 Aug 2026 8:12 AM IST
నారాయణరావు హీరో...చిరంజీవి విలన్ !
X

టాలీవుడ్ సీనియర్ నటుడు పాత తరం హీరో జీవీ నారాయణరావు కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన గురించి ఈ తరానికి పెద్దగా ఏమీ తెలియకపోవచ్చు కానీ పాత తరానికి మాత్రం ఆయన మంచి నటుడు ఆనాటి యంగ్ అండ్ లవ్ లీ హీరో అన్నది బాగా తెలుసు. నారాయణ రావు అంతులేని కధ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో పరిచయం అయ్యారు. ఈ పాత్రను ఆయన దిగ్దర్శకుడు బాలచందర్ ఏ కోణంలో నుంచి ఆలోచించారో దానికి తగినట్లుగా నటించి మెప్పించారు. తొలి సినిమాతోనే ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు వచ్చింది అంటే గ్రేట్ అనాల్సిందే. ఆ తరువాత నారాయణరావు హీరో పాత్రలను ఎన్నో చేశారు. ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, సుబ్బారావుకు కోపం వచ్చింది, ఊరుమ్మడి బ్రతుకులు, నాలాగ ఎందరో వంటి చిత్రాలలో వరుసగా హీరోగా చేస్తూ వచ్చారు.

హీరోగానే ఆయన :

ఇదే సమయంలో చిరంజీవి అప్పట్లో కొత్తగా నట ప్రవేశం చేశారు. ఆయన ప్రాణం ఖరీదు, పునాది రాళ్ళు, మనవూరి పాండవులు సినిమాలతో చిత్ర సీమను ఆకట్టుకున్నారు. అలాంటి సమయంలో నారాయణరావు హీరోగా ఒక సినిమా వచ్చింది. దాని పేరు కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఆ మూవీని బాలచందర్ దగ్గర దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పనిచేసిన ఈరంకి శర్మ డైరెక్ట్ చేశారు. నారాయణరావు హీరోగా మాధవి హీరోయిన్ గా తీసిన ఈ మూవీలో విలన్ పాత్రకు చిరంజీవిని ఎంపిక చేశారు. అలా నారాయణరావు హీరో అయితే చిరంజీవి ప్రతినాయకుడిగా ఈ మూవీలో నటించడం విశేషం. చిత్రమేంటి అంటే అప్పటికే ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నారాయణ రావు తరువాత బ్యాచ్ చిరంజీవి అని చెబుతారు. ఈ మూవీలో నారాయణరావు పాత్ర స్మూత్ గా ఉంటుంది. ఇక చిరంజీవి అప్పటికే తనదైన స్టైల్ లో రాణిస్తూ వస్తున్నారు. ఈ మూవీలో కూడా ఆయన తన మార్క్ చాటుకున్నారు. ఈ మూవీ ఆ విధంగా చిరంజీవికి మంచి మార్కులు పడేలా చేసింది అని చెప్పాలి.

భేషజం లేని తీరు :

ఇక హీరోగా అనేక సినిమాలు చేసిన నారాయణరావు తర్వాత కాలంలో సహాయ పాత్రలు వేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఎలాంటి భేషజాలు ఆయన చూపించేవారు కాదు. ఇక తన కంటే వెనక వచ్చిన నటులు సూపర్ స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నా ఆయన అసూయ పడేవారు కాదు, అది వారి కష్టం కృషి అని మెచ్చుకునేవారు. ఆయన రజనీకాంత్ చిరంజీవితో ఎంతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఇద్దరితో తాను నిర్మాతగా సినిమాలు తీశారు. తెలుగులో యముడికి మొగుడు చిరంజీవితో తీస్తే సూపర్ హిట్ అయింది. దాన్ని రజనీ కాంత్ తో తమిళంలో రీమేక్ చేస్తే అక్కడా హిట్ అయింది. ఈ మూవీతో వచ్చిన లాభాలతో తాను ఒక సొంత ఇంటి వాడిని అయ్యాను అని కారు కొనుక్కున్నాను అని చెప్పడం కూడా నారాయణరావు లోని మంచితనాన్ని తెలియచేస్తుంది.

సాత్విక పాత్రలతోనే :

ఎర్లీ సెవెంటీస్ లో చాలా మంది యంగ్ హీరోలు వచ్చినా వారు పూర్తిగా నిలబడలేకపోవడానికి కారణం అప్పటి సీనియర్ హీరోల ప్రభావం వారి మీద ఉండడమే. నారాయణరావు విషయానికి వస్తే ఆయన ఎక్కువగా సాత్విక పాత్రలే పోషించారు. అప్పటికే తమిళంలో ట్రెండ్ మారింది. కొత్త తరం అభిరుచులు మారాయి. డ్యాన్సులు ఫైట్స్ వారు ఇష్టపడుతున్నారు. ఆ సంగతి తెలిసిన వారు తమను బాగా మలచుకుని టాలీవుడ్ లో వెలిగారు. నారాయణరావు విషయానికి వస్తే కధా బలం ఉన్న చిత్రాలలో నటించి మెప్పించారు. కథలు తరువాత కాలంలో తగ్గి హీరో ఇమేజ్ తో పాటు కమర్షియల్ హంగులు అధికం కావడంతో ఆయన వెనకబడాల్సి వచ్చింది.