తిరిగి రాని లోకాలకు వెళ్లిన సూపర్ స్టార్ గురువు
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలకు యాక్టింగ్ లో మెలకువలు నేర్పిన కెఎస్ నారాయణ స్వామి తుది శ్వాస విడిచారు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Nov 2025 4:59 PM ISTమెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలకు యాక్టింగ్ లో మెలకువలు నేర్పిన కెఎస్ నారాయణ స్వామి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయసు రీత్యా పలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కెఎస్ నారాయణ 92 ఏళ్ల వయసులో తన ఆఖరి శ్వాసను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
యాక్టింగ్ గురువుగా పని చేసిన కెఎస్ నారాయణ స్వామి
కెఎస్ నారాయణ స్వామి ఎంతో మందికి యాక్టింగ్ లో శిక్షణ ఇచ్చి చాలా మంది నటీనటుల్ని సినీ ఇండస్ట్రీకి అందించారు. 1960 రోజుల్లో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఫిల్మ్ ఇన్ట్సిట్యూట్ లో కెఎస్ నారాయణ స్వామి యాక్టింగ్ గురువుగా పనిచేశారు. ఆయన్ని అందరూ పూర్తి పేరుతో కాకుండా కెఎప్ గోపాలి అని పిలిచేవారు. యాక్టింగ్ గురువుగానే కాకుండా గోపాలికి దూరదర్శన్ కేంద్రానికి డైరెక్టర్ గా పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ కూడా ఉంది.
ప్రతీ విషయంలోనూ రజినీలో ధైర్యం నింపుతూ..
తన వద్ద ట్రైనింగ్ తీసుకుంటున్న రోజుల్లో రజినీకాంత్ ను డైరెక్టర్ బాలచందర్ కు పరిచయం చేసి రజినీని సూపర్ స్టార్ ను చేయడమే కాకుండా మొదటి సినిమా అపూర్వ రాగంగల్ ఛాన్స్ వచ్చేలా చేసింది కూడా గోపాలినే. అంతేకాదు, రజినీని యాక్టింగ్ లోనూ, ప్రతీ విషయంలోనూ ఎంతో ఎంతో సపోర్ట్ చేస్తూ నువ్వు చేయగలవు అనే ధైర్యాన్ని నింపుతూ ఉండేవారట గోపాలి.
హీరోగా అయినా, విలన్ గా అయినా ఎలాంటి ఛాన్స్ వచ్చినా దాన్ని అందుకుని ముందు టాలెంట్ ను నిరూపించుకోమనే ధైర్యాన్ని కూడా గోపాలి రజినీకి ఇచ్చారని, అందుకే గోపాలి కంటే రజినీకి విపరీతమైన అభిమానమని చెప్తుంటారు. ఆ అభిమానంతోనే గోపాలి మరణ వార్త వినిగానే రజినీకాంత్ వెంటనే ఆయన భౌతిక కాయాన్ని సందర్శించడానికి వెళ్లి, ఆ తర్వాత గురువుతో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు. 1970 నుంచి 1990 మధ్య కాలంలో గోపాలి వద్ద ఎందరో నటులు ట్రైనింగ్ తీసుకుని స్టార్ యాక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు. ఒక్క రజినీకాంత్‌కే కాకుండా నాజర్, అమితాబ్, చిరంజీవి లాంటి నటులకు కూడా గోపాలి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మరణ వార్త విని అందరూ ఎంతో కలత చెందుతూ ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి ఎంతో తీరని లోటని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
