Begin typing your search above and press return to search.

డెకాయిట్‌కు శేష్ ఫ్రెండ్స్ రివ్యూ

అడివి శేష్ నటించిన తాజా చిత్రం డెకాయిట్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 April 2026 4:03 PM IST
డెకాయిట్‌కు శేష్ ఫ్రెండ్స్ రివ్యూ
X

అడివి శేష్ నటించిన తాజా చిత్రం డెకాయిట్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ నెలకొనగా, విడుదలకు ముందు నిర్వహిస్తున్న ప్రమోషన్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వెన్నెల కిషోర్, రాహుల్ ర‌వీంద్ర‌న్, శేష్ కలిసి నిర్వహించిన చిట్ చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

శేష్ కెరీర్ ప్రారంభం నుంచే విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే ఆయన సినిమా ఎంపికలను చూసి ప్రారంభంలోనే తన స్నేహితులు సైతం ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయని ఈ చిట్ చాట్ లో వెల్లడైంది. చూడ్డానికి స్టైలిష్‌గా క‌నిపిస్తూ, ఎన్నారై అయిన వీడు ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తాడా? అనే సందేహం తమకు కలిగేదని రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ తెలిపారు.

అయితే సినిమా మొదలైన కొద్దిసేపటికే ఆ అనుమానాలన్నీ మాయమవుతాయని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా శేష్ సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులకు హై ఇచ్చే విధంగా ఉంటాయని, ఇంటర్వెల్ సమయంలో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతుందని, క్లైమాక్స్ వరకు ఆ ఆసక్తి తగ్గకుండా కొనసాగుతుందని చెప్పారు. అందుకే శేష్ సినిమాలకు ఒక ప్రత్యేక థ్రిల్ ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు.

ఇక స్నేహితులుగా తమకు ఉన్న అనుబంధం గురించి కూడా వారు వివరించారు. శేష్ ప్రతి సినిమా పూర్తయ్యాక ముందుగా తమకే చూపించడం తన అలవాటుగా మార్చుకున్నాడని తెలిపారు. ఆ ప్రక్రియలో తాము నిజాయితీగా ఫీడ్‌బ్యాక్ ఇస్తామని, అదే ఆయనకు మరింత నమ్మకాన్ని ఇస్తుందని చెప్పారు. డెకాయిట్ సినిమాను కూడా విడుదలకు ముందే చూశామ‌ని, ఈ సినిమా కూడా తమకు బాగా నచ్చిందని, ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీలో శేష్‌కు ఉన్న స్నేహితుల వలయం కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ ఫ్రెండ్ సర్కిల్ నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్ ఆయన సినిమా క్వాలిటీని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు. మొత్తానికి, విడుదలకు ముందే సన్నిహితుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న డెకాయిట్ పై అంచనాలు మరింత పెరిగాయి. శేష్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోంది.