నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!
‘ఛలో’ తర్వాత నాగశౌర్య, దర్శకుడు వెంకీ కుడుముల మధ్య విభేదాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన వెంకీ.. స్నేహితుల మధ్య అభిప్రాయభేదాలు సహజమని, అంతమాత్రాన సంబంధాలు దెబ్బతిన్నట్లు కాదని చెప్పారు. ప్రస్తుతం తమ మధ్య పెద్ద సమస్యలేమీ లేవని స్పష్టం చేశారు.
By: Priya Chowdhary Nuthalapti | 13 Nov 2026 2:03 PM ISTటాలీవుడ్లో హీరోలకి, దర్శకులకి మధ్య కొన్నిసార్లు విభేదాలు రావడం సాధారణమే. అయితే కొంతమంది దాన్ని జీవితాంతం కొనసాగించగా.. మరి కొంతమంది మాత్రం కొద్ది రోజులకు మర్చిపోయి మళ్ళీ ముందులానే కొనసాగుతారు. ఇలాంటి సందర్భమే నాగశౌర్యకి, దర్శకుడు వెంకీ మధ్య చోటుచేసుకుంది.
హనాగశౌర్య హీరోగా నటించిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల.. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత నాగశౌర్య, వెంకీ కుడుముల కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని చాలామంది భావించారు. కానీ అనుకున్నట్లుగా ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పనిచేయలేదు. అప్పట్లో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు బాగా వినిపించాయి.
ఛలో సినిమా విడుదలైన సమయంలో నాగశౌర్యకి, దర్శకుడు వెంకీ కుడుములకు మధ్య మంచి అనుబంధం ఉండేది. సినిమా విజయం సాధించిన సందర్భంగా నాగశౌర్య తల్లి వెంకీ కుడుములకు కారు బహుమతిగా ఇచ్చారనే విషయం కూడా అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే ఆ తర్వాత ఆ కారు విషయంలో నాగశౌర్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ సమయంలో నాగశౌర్య చేసిన వ్యాఖ్యలకు వెంకీ కుడుముల కూడా స్పందించారు. దీంతో ఈ కాంబినేషన్ మళ్లీ ఉండకపోవచ్చనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది.
ఇన్నాళ్ల తర్వాత తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెంకీ కుడుములకు నాగశౌర్యతో ఉన్న విభేదాల గురించి ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందిస్తూ.. స్నేహితుల మధ్య అయినా, కుటుంబ సభ్యుల మధ్య అయినా అప్పుడప్పుడు అభిప్రాయభేదాలు రావడం సహజమని చెప్పారు. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక మాటను కూడా గుర్తుచేసుకున్నారు. మైక్ ముందు మంచి విషయాలు మాట్లాడాలని, వ్యక్తిగతంగా చెప్పాల్సిన విషయాలను చెవిలో చెప్పాలని చిరంజీవి చెపుతారని , తాను కూడా అదే పద్ధతిని అనుసరించాలని అనుకుంటున్నట్లు తెలిపారు.
అయితే ఛలో తర్వాత అప్పటికే.. నాగశౌర్య నర్తనశాల లాంటి సినిమాలను లైన్లో పెట్టుకొని ఉన్నారని.. అందుకే అప్పుడు తను సినిమా చేయాలి అనుకోలేదని చెప్పారు. మరి ఆ తర్వాత కూడా సినిమా ఎందుకు చేయలేదు అని మరోసారి యాంకర్ అడగగా.. స్నేహితుల మధ్య కూడా కొన్ని సందర్భాల్లో విభేదాలు ఉంటాయని, అంతమాత్రాన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నట్లు కాదని.. ప్రస్తుతం తమ మధ్య ఎలాంటి పెద్ద సమస్య లేదనే తెలిపారు.
