Begin typing your search above and press return to search.

ఇట్లు అర్జున: ప్రతి డైరెక్టర్ ఒక్క మూవీ అయినా ప్రొడ్యూస్ చేస్తేనే..

ఇట్లు అర్జున సినిమాకు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ తన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

By:  M Prashanth   |   20 Sept 2026 2:44 PM IST
ఇట్లు అర్జున: ప్రతి డైరెక్టర్ ఒక్క మూవీ అయినా ప్రొడ్యూస్ చేస్తేనే..
X

సినిమా తీస్తున్నప్పుడు స్టోరీ, సీన్లు, క్యాస్టింగ్, టెక్నికల్ అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసే దర్శకుడికి.. నిర్మాతగా మారితే అసలు మూవీ కష్టం ఏంటో తెలుస్తుంది. బడ్జెట్ నుంచి ప్రతి చిన్న ఖర్చు వరకు లెక్క చూసుకోవాల్సి వస్తుంది. ఇదే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దర్శకుడు వెంకీ కుడుములకు కూడా ఎదురైంది. తన సొంత బ్యానర్ పై ఇట్లు అర్జున సినిమాను నిర్మిస్తున్న ఆయన.. ప్రతి డైరెక్టర్ కనీసం ఒక్క సినిమానైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుందని చెబుతున్నారు.

ఇట్లు అర్జున సినిమాకు మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ తన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ హీరోగా పరిచయమవుతుండగా.. మాలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌ గా నటిస్తోంది. బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ముకేష్ రిషి, గెటప్ శ్రీను, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 30న ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఇప్పుడు రీసెంట్ గా రిలీజైన టీజర్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. అయితే ఆ మూవీ గురించి మాట్లాడిన వెంకీ కుడుముల.. తన ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చారు. దర్శకుడిగా ఉన్నప్పుడు నిర్మాతల కష్టాన్ని చూశానని, కానీ నిర్మాతగా మారిన తర్వాత ఆ కష్టం అర్థమైందని అన్నారు. దర్శకుడిగా ఉన్నప్పుడు ఒక సీన్ ఎలా తీయాలనే ఆలోచన ఉంటుందని.. నిర్మాతగా మారిన తర్వాత అదే సీన్‌ కు ఎంత ఖర్చవుతుందనే ఆలోచన వస్తుందని చెప్పారు.

బడ్జెట్‌ కు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకోవాలని, అవసరానికి మించి ఖర్చు చేస్తే మొత్తం సిస్టమ్ పై ఎఫెక్ట్ పడుతుందని వివరించారు. ఒక సినిమాకు పనిచేసే ప్రతి ఒక్కరూ కష్టపడతారని.. వారికి పేమెంట్ వస్తుందని చెప్పారు. కానీ నిర్మాత మాత్రం తన జేబులోని డబ్బుతో పాటు అప్పులు తెచ్చి, కుటుంబాన్ని కూడా రిస్క్‌ లో పెట్టి సినిమా చేస్తాడని అన్నారు. అలాంటి నిర్మాతల వల్లే కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని పేర్కొన్నారు.

ఇక సినిమాలో అనీష్ రోల్ కు మాటలు ఉండవని, డెబ్యూ హీరోగా అలాంటి ఛాలెంజింగ్ రోల్‌ ను తీసుకోవడం మామూలు విషయం కాదన్నారు. కథ చెప్పినప్పుడు మాటలు లేని రోల్ అని తెలిసినా అనీష్ ఛాలెంజింగ్‌ గా తీసుకున్నాడని, సర్ప్రైజ్ చేస్తాడని తెలిపారు. గతంలో కిర్రిక్ పార్టీ’ ద్వారా రష్మికను హీరోయిన్‌ గా పరిచయం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్న వెంకీ.. ఇప్పుడు అనీష్ విషయంలోనూ అదే నమ్మకంతో అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.

దర్శకుడు సాఫ్ట్‌ వేర్ ఉద్యోగం చేస్తూనే కథ రాసుకున్నారని, తన స్టోరీ నచ్చడంతో ఛాన్స్ ఇచ్చినట్లు తెలిపారు. తన తొలి ప్రొడక్షన్‌ లో రాజా డీవోపీగా పనిచేయడం గర్వంగా ఉందని చెప్పిన వెంకీ.. ఒక డైరెక్టర్ సినిమా ప్రొడ్యూస్ చేస్తే అన్ని క్రాఫ్ట్స్‌ పై అవగాహన వస్తుందని అన్నారు. అందుకే ప్రతి దర్శకుడు ఒక్క సినిమానైనా నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఇట్లు అర్జునతో వెంకీ నిర్మాతగా ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.