ఇలాంటి కథ ఎంచుకోవడానికి చాలా ధైర్యం కావాలి: వెంకీ అట్లూరి
సుమంత్ నటించిన `మహేంద్రగిరి వారాహి` చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు.
By: Sivaji Kontham | 28 Aug 2026 10:51 PM ISTసుమంత్ నటించిన `మహేంద్రగిరి వారాహి` చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడిన మాటలు, ముఖ్యంగా హీరో సుమంత్ జడ్జిమెంట్ - కథల ఎంపికపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఇండస్ట్రీలో సుమంత్ లాంటి జెన్యూన్ వ్యక్తి చాలా అరుదని వెంకీ అట్లూరి కొనియాడారు. తాను ఏ కథ రాసినా సరే.. మొదట సుమంత్ అన్న దగ్గరికే తీసుకెళ్తానని వెల్లడించారు. సుమంత్ కథల ఎంపిక, సజెషన్స్.. ఒక సినిమా హిట్టవుతుందో లేదో ముందే ఊహించే జడ్జిమెంట్ (సక్సెస్ ఫార్ములా) ఎప్పుడూ పర్ఫెక్ట్‌గా `ఆన్ డాట్` ఉంటుందని చెప్పారు. అలాంటి సుమంత్ అన్ననే ఈ సినిమా విజయంపై అంత నమ్మకంతో ఉన్నారంటే `మహేంద్రగిరి వారాహి` కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కాబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
సాధారణమైన కథలను ఎంచుకుని తీయడం చాలా సులభమని... కానీ సంస్కృతి, దైవిక అంశాలతో కూడిన పౌరాణిక సబ్జెక్ట్‌ను ఎంచుకోవడానికి ఎంతో ధైర్యం, పరిణతి (మ్యాచ్యూరిటీ) కావాలని వెంకీ అట్లూరి అభిప్రాయపడ్డారు. ఇలాంటి వైవిధ్యమైన కథను ఎంచుకుని ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సంతోష్ జాగర్లమూడిని అతడు ప్రత్యేకంగా అభినందించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే ఇలాంటి దైవిక చిత్రాలను మనం ఆదరించడమే కాకుండా.. దాని నుండి నేర్చుకోవాలని కూడా పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మణ్ గారిపై వెంకీ అట్లూరి సరదా వ్యాఖ్యలు చేశారు. లక్ష్మణ్ సార్ ఎక్కడ ఉంటే అక్కడ డబ్బులు ఉంటాయని.. ఆయన ఏ ప్రాజెక్ట్‌లో భాగమైనా అది పెద్ద హిట్ అయ్యి మంచి లాభాలు తెస్తుందని.. ఆయనది `మిడాస్ టచ్` అని ప్రశంసించారు. అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్‌తో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అనూప్ మ్యూజిక్‌కు తాను 2006 నుంచే పెద్ద ఫ్యాన్ అని తెలిపారు.
దర్శకుని ధైర్యం - కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ.. సాధారణ కథలను ఎంచుకోవడం సులభమే కానీ..ఇలాంటి కష్టమైన- సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్న పౌరాణిక సబ్జెక్ట్‌ను ఎంచుకుని తెరకెక్కించడానికి చాలా ధైర్యం కావాలని దర్శకుడు సంతోష్‌ను అభినందించారు. మన సంస్కృతితో కూడిన ప్రతి దైవిక చిత్రాన్ని (డివైన్ ఫిల్మ్) అందరూ సపోర్ట్ చేయాలని.. దాని నుంచి నేర్చుకోవాలని కోరారు.
గతంలో సుమంత్ నటించిన `గోదావరి` చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అంతకంటే ఎక్కువ విజయాన్ని , పేరును ఈ `మహేంద్రగిరి వారాహి` సాధించాలని వెంకీ అట్లూరి ఆకాంక్షించారు. ఇటీవల ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాలను బాగా ఆదరిస్తున్నారని.. అదే జోరుతో సెప్టెంబర్ 11న రానున్న ఈ చిత్రాన్ని కూడా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
