పెళ్ళికి 100 మందే అవసరం.. వీళ్ళే అనవసరంగా 1000 మందిని పిలుస్తారు: వెంకటేష్
టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి.
By: Sivaji Kontham | 30 Sept 2026 7:52 AM ISTటాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రాలకు సంబంధించిన విశేషాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. తాజాగా వీళ్లిద్దరూ `ఆదర్శ కుటుంబం` సినిమా ప్రచార వేదికపై మాట్లాడిన మాటలు ప్రస్తుతం సినిమా వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా మన సమాజంలో పెళ్లిళ్లు - ఇతర వేడుకల ఖర్చుల గురించి వారు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.
మన దేశంలో జరిగే పెళ్లిళ్లకు ఖర్చుల సరళి గురించి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ..ఇక్కడ దాదాపు 90 శాతం పైగా ఖర్చులు కేవలం అవసరాల కోసమే జరుగుతాయని తెలిపారు. సొంతిల్లు కొనడం లేదా విలాసవంతమైన లగ్జరీల కోసం ఎవరూ ఎక్కువగా ఖర్చు చేయరని.. ప్రధానంగా వాహనాలు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు వంటి అత్యవసరమైన విషయాల కోసమే ప్లాన్ చేసుకుని డబ్బు ఖర్చు పెడతారని ఆయన వివరించారు.
అయితే, పెళ్లి ఏర్పాట్లు మరియు అతిథుల గురించి చర్చ జరుగుతున్న సమయంలో యాంకర్ సుమ స్పందిస్తూ.. పెళ్లిళ్లు మనం ప్లాన్ చేసుకున్న విధంగా ఎప్పుడూ జరగవని... కొన్నిసార్లు అంచనాలు తారుమారు అవుతుంటాయని అభిప్రాయపడ్డారు. తాము కేవలం 100 మంది వస్తారని అంచనా వేసి పెళ్లి చేస్తే.. అనూహ్యంగా 600 మంది వరకు అతిథులు వస్తుంటారని దీనివల్ల భోజనాలు సరిపోక ఇబ్బందులు ఎదురవుతుంటాయని ఆమె పేర్కొన్నారు.
యాంకర్ సుమ వ్యాఖ్యలపై హీరో వెంకటేష్ స్పందిస్తూ ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు. పెళ్లికి 600 మంది వస్తారనడంలో అర్థం లేదని, అసలు ఆ అతిథులను ఆహ్వానించేది మనమే కదా అని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి 100 మంది అతిథులు వస్తే కేవలం వారికి సరిపడా ఆహారం ప్లాన్ చేసుకుంటే సరిపోతుందని.. కానీ కొందరు కావాలనే అనవసరంగా వెయ్యి మందిని వివాహానికి ఆహ్వానిస్తుంటారని వెంకటేష్ విమర్శించారు.
చివరగా.. పెళ్లి -పెద్దరికం - ఆర్భాటాల గురించి త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ఇలా ఎక్కువ మందిని వేడుకకు పిలవడం కేవలం ఒక `లుక్` కోసం, పదిమందిలో గొప్పగా కనిపించడం కోసమే జరుగుతుందని స్పష్టం చేశారు. కేవలం హోదా లేదా ప్రదర్శన కోసం చేసే ఈ పద్ధతి సరైనది కాదని.. అది పూర్తిగా తప్పని మనకు స్పష్టంగా తెలుసని ఆయన విశ్లేషించారు.
