భానుమతి మల్లీశ్వరి అంటూ సుమకే షాక్.. స్టేజ్ పై బుడ్డోడి రచ్చ
ఈవెంట్లలో యాంకర్ సుమ వేసే కౌంటర్లకు ఎవరైనా సరే బిత్తరపోవాల్సిందే.
By: M Prashanth | 28 Oct 2026 9:30 AM ISTఈవెంట్లలో యాంకర్ సుమ వేసే కౌంటర్లకు ఎవరైనా సరే బిత్తరపోవాల్సిందే. వేదికపైకి వచ్చే స్టార్ల దగ్గర నుంచి గెస్టుల వరకు అందరినీ తన పంచ్ లతో ఆడేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అయితే శిల్పకళా వేదికపై జరిగిన 'ఆదర్శ కుటుంబం' వేడుకలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చైల్డ్ ఆర్టిస్ట్ రాజా ప్రజ్వల్ వేసిన దెబ్బకు ఏకంగా సుమకే నోట మాట రాలేదు. స్క్రిప్ట్ లేకుండా సాగిన ఈ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అసలు విషయం ఏంటంటే, స్టేజ్ పై మాటల సందర్భంలో సుమను మీరు ఎప్పుడు పుట్టారు అంటూ ఈ బుడతడు చాలా అమాయకంగా అడిగాడు. దానికి సుమ కాస్త వెటకారంగా స్పందిస్తూ, నేను మల్లీశ్వరి టైంలో పుట్టాను అని చెప్పింది. వెంకీ సినిమా మల్లీశ్వరిని ఉద్దేశించి ఆమె అలా అనగానే, ప్రజ్వల్ క్షణం కూడా ఆలోచించకుండా మన భానుమతి గారి మల్లీశ్వరియా అంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చాడు.
1951 నాటి పాత క్లాసిక్ ను గుర్తుచేస్తూ సుమ వయసును ఏకంగా డెబ్బై ఏళ్ల వెనక్కి నెట్టేయడంతో ఆడిటోరియం మొత్తం పగలబడి నవ్వింది. దెబ్బకు షాకైన సుమ, గెట్ ఔట్ అంటూ నవ్వుతూ వాడిని పక్కకు తోసేయాల్సి వచ్చింది. ఇక్కడితో ఈ రచ్చ ఆగలేదు. కింద కూర్చున్న దర్శకుడు త్రివిక్రమ్ మైక్ అందుకుని మరింత ఫన్ క్రియేట్ చేశారు. రేయ్ ప్రజ్వల్.. భవిష్యత్తులో నీకు పుట్టే కొడుకు టైమ్ కి కూడా ఈవిడ ఇక్కడే ఉంటుంది, వాడు వచ్చి ఇక్కడ ఆడుతుంటాడు, ఈవిడ ఇక్కడే కూర్చుని చూస్తూనే ఉంటుంది ఎవరనుకుంటున్నావు అంటూ సుమ యాంకరింగ్ కెరీర్ పై క్రేజీ జోస్యం చెప్పారు.
తన పాస్ట్ తవ్వొద్దని సుమ ఎంత బతిమాలినా, నాకంటే నువ్వు చిన్నదానివేనంటూ గురూజీ కాసేపు ఆటపట్టించారు. ఇక తట్టుకోలేకపోయిన సుమ, ఇక్కడ ఉన్న అందరికంటే ఒక్క బ్రహ్మాజీ గారు మాత్రమే పెద్దవారు అంటూ టాపిక్ ను ఆయన మీదికి డైవర్ట్ చేసి సేఫ్ అవ్వడానికి నానా తంటాలు పడింది.
ఈ నవ్వుల హంగామా ముగిసిందో లేదో, అంతలోనే సడెన్ గా శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారి కారు కీస్ మిస్సయ్యాయంటూ సుమ ఒక అనౌన్స్మెంట్ చేసింది.
అంతే, కింద కూర్చున్న విక్టరీ వెంకటేష్ తక్షణమే మైక్ అందుకుని రేయ్ ప్రజ్వల్.. ఇచ్చేయ్ రా.. నాకు తెలుసు నీ సంగతి ఇచ్చేయ్ అంటూ అరిచారు. వెంకీ పట్టుకోవడంతో ప్రజ్వల్ తన జేబులో నుంచి ఆ కీస్ తీసి ఇచ్చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. మావాడు అంతే, మ్యాజిక్ చేస్తాడు, ఇవాళ అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ వెంకీ నవ్వుతూ చేసిన కామెంట్స్ ఈవెంట్ కు హైలైట్ గా నిలిచాయి.
సినిమా ప్రమోషన్లంటే అంతా ప్లాన్డ్ గా, ముందే రాసుకున్న డైలాగులు మాట్లాడే రొటీన్ రోజుల్లో ఇలాంటి ఆర్గానిక్ కామెడీ కనిపించడం చాలా అరుదు. ఒక చిన్న పిల్లాడు స్టార్ డైరెక్టర్, సీనియర్ హీరో, స్టార్ యాంకర్ మధ్య అంత ఈజ్ తో సెటైర్లు పేలుస్తూ ఒక చిన్నపాటి షో నడిపించేశాడు. త్రివిక్రమ్ కథల్లో కనిపించే నేచురల్ హ్యూమర్ ఈవెంట్ లోనూ రియల్ గా కనిపించింది. ఆదర్శ కుటుంబంలో ఈ పిల్లాడి పాత్ర ఏ స్థాయిలో మెప్పించబోతోందో ఈ ఒక్క శాంపిల్ చూస్తేనే అర్థమవుతోంది.
