Begin typing your search above and press return to search.

వెంకీ-త్రివిక్ర‌మ్ నుంచి ఇది ఊహించ‌నిదే!

క్లాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీస్ ని థియేటర్లకు రప్పించడంలో ఈ కాంబోకు తిరుగులేదు. అందుకే తాజా ప్రాజెక్ట్ కూడా చక్కటి ఆదర్శ కుటుంబ నేపథ్యంతో సాగుతుందని అందరూ భావించారు.

By:  Srikanth Kontham   |   25 May 2026 10:09 PM IST
వెంకీ-త్రివిక్ర‌మ్ నుంచి ఇది ఊహించ‌నిదే!
X

విక్టరీ వెంకటేష్- త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇద్ద‌రి కలయికలో సినిమా అంటే ప్రేక్షకులు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయమని భావిస్తారు. ఇంత‌వ‌ర‌కూ నేరుగా వెంకీని డైరెక్ట్ చేయ‌క‌పోయినా? అత‌డు హీరోగా న‌టించిన చాలా సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేయ‌డంతో ఈ బ‌జ్ నెల‌కొంది. అలాంటిదిప్పుడు ఏకంగా ఇద్ద‌రి కాంబినేష‌న్ లోనే సినిమా ప‌ట్టాలెక్కిందంటే? హైప్ ఎలా ఉందో చెప్పాల్సిన ప‌నిలేదు. సాధారణంగా వెంకటేష్-త్రివిక్రమ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రాలు. సున్నితమైన హాస్యం, గుండెకు హత్తుకునే భావోద్వేగాలు.

క్లాస్ ఆడియన్స్‌ను, ఫ్యామిలీస్ ని థియేటర్లకు రప్పించడంలో ఈ కాంబోకు తిరుగులేదు. అందుకే తాజా ప్రాజెక్ట్ కూడా చక్కటి ఆదర్శ కుటుంబ నేపథ్యంతో సాగుతుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చిత్రంలో సరికొత్త ఎలిమెంట్స్‌ను జోడించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామాలో ఊహించని విధంగా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయనే వార్త ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో భారీ ఫైట్ సీన్‌ను ప్లాన్ చేశారట. ఒక పక్క కుటుంబ విలువల ప్రాధాన్యతను చూపిస్తూనే మరోపక్క మాస్ ప్రేక్షకులను సైతం మెప్పించేలా త్రివిక్రమ్ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్లు టాక్.

ఈ క్రేజీ కాంబినేషన్ నుండి ఇలాంటి యాక్షన్ ట్విస్ట్‌ను ఊహించలేదు. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా కేవలం సెంటిమెంట్‌కే పరిమితం కాకుండా కమర్షియల్ హంగులను కూడా జోడించాలనే ఉద్దేశంతోనే త్రివిక్రమ్ ఈ తరహా స్క్రీన్‌ప్లేను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆదర్శవంతమైన కుటుంబంలో వచ్చే సమస్యలను, హీరో ఎంత పవర్‌ఫుల్‌గా ఎదుర్కొన్నాడనే కోణంలో యాక్షన్ సీన్లు సాగుతాయని సమాచారం. మాటల మాంత్రికుడి క్లాసిక్ టచ్‌తో పాటు మాస్ యాక్షన్ తోడవటం సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

విక్టరీ వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంత పట్టు ఉందో? మాస్ యాక్షన్ చిత్రాలను అంతే అద్భుతంగా పండించగలరనే విషయం తెలిసిందే. గతంలో ఆయన చేసిన పలు యాక్షన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా త్రివిక్రమ్ మార్క్ మేకింగ్‌లో వెంకీ సరికొత్త యాక్షన్ అవతారంలో కనిపించనుండటం సాధారణ ప్రేక్షకుల సైతం ఆసక్తిని రేకెత్తిస్తోంది.వెంకీ-త్రివిక్రమ్ అనగానే సెంటిమెంట్ మాత్రమే ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంద‌ని చెప్పొచ్చు. ఆదర్శ కుటుంబం అనే క్లాస్ కాన్సెప్ట్‌కు, హై-వోల్టేజ్ యాక్షన్ అనే మాస్ ఎలిమెంట్‌ను జోడించి త్రివిక్రమ్ చేస్తున్న ప్రయోగం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.