వెంకీ త్రివిక్రమ్.. లక్కీ మంత్ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం హెచ్ నెం 47 సినిమా విడుదలపై ఒక క్రేజీ టాక్ వినిపిస్తోంది.
By: M Prashanth | 18 Jun 2026 6:01 PM ISTవెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఆదర్శ కుటుంబం హెచ్ నెం 47 సినిమా విడుదలపై ఒక క్రేజీ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ నెలలో థియేటర్లలోకి తీసుకురావడానికి టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. ఇన్ని రోజులు ఈ సినిమా దీపావళి లేదా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉంటుందని భావించినా, లేటెస్ట్ గా అక్టోబర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అయితే గాంధీ జయంతి రోజున కూడా సినిమా వచ్చే అవకాశం ఉందనే టాక్ ఒక వైపు వినిపిస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ కెరీర్ లో అక్టోబర్ నెలకు ఉన్న ప్రత్యేక కనెక్షన్ చూస్తుంటే వేరే తేదీలను కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు. రైటర్ గా త్రివిక్రమ్ కు ఫస్ట్ బిగ్ బ్రేక్ ఇచ్చిన నువ్వే కావాలి సినిమా 2000 సంవత్సరం అక్టోబర్ 13న రిలీజై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ ఒక్క సినిమాతోనే క్రేజ్ మారిపోయింది.
దర్శకుడిగా పరిచయం అయిన మొదటి సినిమా నువ్వే నువ్వే కూడా 2002 అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ మనసులు గెలుచుకుంది. ఒకవేళ అక్టోబర్ 2 కుదరకపోతే, సెంటిమెంట్ పరంగా నువ్వే నువ్వే విడుదలైన అక్టోబర్ 10వ తేదీన ఈ కొత్త సినిమాను తెచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మేకర్స్ కూడా ఈ లక్కీ డేట్స్ పై ఒక లుక్ వేసినట్లు సమాచారం.
ఇవే కాకుండా త్రివిక్రమ్ కెరీర్ లో మరికొన్ని ముఖ్యమైన సినిమాలు ఈ నెలలోనే వచ్చాయి. మహేష్ బాబుతో చేసిన ఖలేజా 2010 అక్టోబర్ 7న విడుదలైంది. కమర్షియల్ గా పెద్దగా వర్కవుట్ అవ్వకపోయినా రైటింగ్ పరంగా అదొక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది. ఎన్టీఆర్ తో తీసిన అరవింద సమేత వీర రాఘవ 2018 అక్టోబర్ 11న రిలీజై బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ రేంజ్ ఓపెనింగ్స్ అందుకుంది. ఆ సినిమా దసరా సెలవులను పక్కాగా వాడుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అత్తారింటికి దారేది కూడా సెప్టెంబర్ చివర్లో వచ్చి అక్టోబర్ అంతా థియేటర్లలో సందడి చేసింది.
కొద్ది రోజులుగా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో నడిచిన సంగతి తెలిసిందే. కాపీరైట్ ఇబ్బందులు రాకుండా రైటింగ్ టేబుల్ పై చాలా జాగ్రత్తులు తీసుకుంటున్నారని అనుకున్నారు. కానీ ఇప్పుడు షూటింగ్ పనులను వేగవంతం చేసి అక్టోబర్ లోనే తేవాలని మేకర్స్ ప్లానింగ్ లో ఉన్నట్లు టాక్. వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ కు త్రివిక్రమ్ డైలాగ్స్ తోడైతే పండగ సీజన్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది.
ఈ ఏడాది సెకండాఫ్ లో ఇప్పటికే చాలా పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి. అక్టోబర్ లో బాలకృష్ణ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇలాంటి టైమ్ లో వెంకీ లాంటి స్టార్ హీరో సినిమా దసరా రేసులోకి వస్తే థియేటర్ల వద్ద పోటీ చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఏదేమైనా ఈ అక్టోబర్ రిలీజ్ డేట్ పై పూర్తి క్లారిటీ రావాలంటే ప్రొడక్షన్ హౌస్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చే వరకు ఆగాల్సిందే.
