రావిపూడి సరే.. మరో డైరెక్టర్ ఎక్కడ వెంకీ?
‘సంక్రాంతికి వస్తున్నాం’తో రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన వెంకటేశ్‌కు ఇప్పుడు కొత్త దర్శకుల కాంబినేషన్లు సెట్ కావడం లేదు. అనిల్ రావిపూడితో వరుస విజయాలు అందుకున్నా, ‘సైంధవ్’, ‘ఆదర్శ కుటుంబం’ నిరాశపరిచాయి. మంచి కథల కోసం ఎదురుచూస్తున్న వెంకీ.. 2027 జనవరి 12న కళ్యాణ్‌రామ్‌తో మల్టీస్టారర్‌లో కనిపించనున్నారు.
By: M Prashanth | 20 Nov 2026 10:06 AM ISTవెంకటేశ్ బాక్సాఫీస్ సత్తా ఏంటో గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం'తో మరోసారి రుజువైంది. సరైన టైమ్ లో సరైన కాంబినేషన్ సెట్టవ్వడంతో రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించగలిగారు. అయితే ఇంత పెద్ద విజయం అందుకున్న తర్వాత కూడా వెంకీ కొత్త ప్రాజెక్టుల సెలక్షన్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నారు కానీ, కొత్త కాంబినేషన్లు మాత్రం పెద్దగా సెట్ కావడం లేదు. ఇటీవల త్రివిక్రమ్‌తో చేసిన సినిమా ఫలితం కూడా ఆశించినట్లుగా లేకపోవడం మరో సమస్యగా మారింది.
గత ఆరేడేళ్లలో వెంకీకి థియేటర్లలో మంచి విజయాలు అందించిన దర్శకుల్లో అనిల్ రావిపూడిదే పైచేయి. 'ఎఫ్2'తో మొదలై ఎఫ్3, 'సంక్రాంతికి వస్తున్నాం' వరకు కొనసాగింది. ఈ ఏడాది చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'లో వెంకీ గెస్ట్ రోల్ కూడా బాగా కలిసొచ్చింది. ఇప్పుడు మరోసారి 'జనవరి 12 విడుదల' కోసం కలిశారు. ఒకే దర్శకుడితో ఇన్నిసార్లు సినిమా చేయడం బాగానే ఉంది కానీ, వెంకీకి మరో నమ్మకమైన కాంబినేషన్ లేకపోవడమే ఇబ్బంది.
మధ్యలో 'నారప్ప', 'దృశ్యం 2' సినిమాలతో కూడా వెంకీ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే రెండూ రీమేక్‌లే. పైగా కరోనా సమయంలో నేరుగా ఓటీటీలో విడుదలయ్యాయి. ఒకప్పుడు వెంకీకి బాగా కలిసొచ్చిన రీమేక్‌ల పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ఒరిజినల్ సినిమాలు తెలుగు డబ్బింగ్‌తోనూ ఓటీటీల్లో అందుబాటులోకి వస్తున్నాయి. చివరకు 'దృశ్యం 3'ను కూడా తెలుగులో రీమేక్ చేయకుండా డబ్బింగ్ వెర్షన్ తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయి.
ఇక కొత్త కథలతో చేసిన సినిమాల్లో 'సైంధవ్' నిరాశపరిచింది. శైలేష్ కొలను దర్శకత్వంలో యాక్షన్ మూవీ చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. ఇటీవల త్రివిక్రమ్‌తో చేసిన 'ఆదర్శ కుటుంబం' కూడా భారీ విజయం అందుకోలేదు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో చాలా ఏళ్ల తర్వాత సినిమా చేసినా వెంకీ ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో అనిల్ రావిపూడి కాకుండా వెంకీని సరిగ్గా ఉపయోగించుకోగల దర్శకుడు ఎవరనే ప్రశ్న వస్తోంది.
నిజానికి వెంకీ కథలు వినడం లేదని కాదు. గతంలో 'లక్కీ భాస్కర్' దర్శకుడు వెంకీ అట్లూరి కథ వినిపించినట్లు వార్తలు వచ్చాయి. మరో యువ దర్శకుడు పేరు కూడా వినిపించింది. కానీ ఆ కాంబినేషన్లు ఇప్పటివరకు సెట్టవ్వలేదు. వెంకీ కామెడీ టైమింగ్‌తో పాటు ఎమోషనల్ పాత్రలను కూడా అద్భుతంగా చేయగలరు. గురు, దృశ్యం, నారప్ప లాంటి సినిమాల్లో అది కనిపించింది. అలాంటి కథలతో వచ్చే కొత్త దర్శకులను కూడా వెంకీ ఎంచుకుంటే మరో మంచి కాంబినేషన్ దొరికే అవకాశం ఉంటుంది.
అయితే అనిల్ రావిపూడి కూడా ఎప్పటికీ వెంకీతోనే సినిమాలు చేయడం కుదరదు. ఇప్పటికే బాలకృష్ణ, చిరంజీవితో విజయాలు అందించిన అనిల్ లేటెస్ట్ గా ఎన్టీఆర్‌తోనూ సినిమా ప్రకటించారు. 2027 జనవరి 12న వెంకటేశ్, కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకీ కొత్తగా ఏ దర్శకుడితో సినిమా అనౌన్స్ చేస్తారో చూడాలి.
