వెంకీ మామతో నాగార్జున, బాలయ్య కాంబో ఎప్పటికి?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల మల్టీస్టారర్లంటే అభిమానులకు ఎప్పుడూ పండగే. ఇండస్ట్రీ టాప్ హీరోలను కలిపి సినిమాలు తీయడంలో దర్శకుడు అనీల్ రావిపూడి ముందు వరుసలో ఉన్నారు.
By: Sivaji Kontham | 27 Feb 2026 10:00 AM ISTతెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల మల్టీస్టారర్లంటే అభిమానులకు ఎప్పుడూ పండగే. ఇండస్ట్రీ టాప్ హీరోలను కలిపి సినిమాలు తీయడంలో దర్శకుడు అనీల్ రావిపూడి ముందు వరుసలో ఉన్నారు. వెంకటేష్- వరుణ్ తేజ్, వెంకటేష్- చిరంజీవి కాంబినేషన్లను బ్లాక్ బస్టర్లుగా మలిచారు. ఇప్పుడు వెంకటేష్- కళ్యాణ్ రామ్ లతో 2027 సంక్రాంతికి ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే వెంకటేష్- బాలకృష్ణ, వెంకటేష్- నాగార్జునలతోను అపజయమెరుగని రావిపూడి సినిమాలు ప్లాన్ చేస్తున్నారా? అంటే అందుకు ఆస్కారం లేకపోలేదనేది ఒక విశ్లేషణ.
వెంకటేష్ - బాలకృష్ణ కలిసి నటించారా?
ఈ ఇద్దరు అగ్ర హీరోలతో మల్టీస్టారర్ కి ఆస్కారం లేకపలేదు. ఏదైనా మల్టీస్టారర్ లో నేరుగా కలిసి నటించలేదు. అయితే వీరిద్దరూ కొన్ని సినిమా వేడుకల్లో, స్టేజ్ షోలలో, ప్రైవేట్ ఈవెంట్లలో చాలా సరదాగా కనిపిస్తుంటారు. బాలయ్య హోస్ట్ చేసిన `అన్‌స్టాపబుల్ విత్ NBK` టాక్ షోకి వెంకటేష్ అతిథిగా వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. భవిష్యత్తులో వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలని కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వెంకటేష్ - నాగార్జున కాంబినేషన్:
వెంకటేష్ - నాగార్జున మధ్య బావా-బామ్మర్ది రిలేషన్ గురించి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. రావుగారింట్లో రౌడీ (1990) సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించగా, నాగార్జున ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. వెంకటేష్ కూడా ఒక చిన్న అతిథి పాత్రలో మెరిశారు. ఊపిరి (2016) చిత్రంలో నాగార్జున ప్రధాన పాత్రలో నటించగా, వెంకటేష్ ఒక సరదా అతిథి పాత్రలో కనిపించారు. కీలక సన్నివేశాల్లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్‌లా అనిపించింది. 2014లో వచ్చిన మనం అక్కినేని కుటుంబం అంతా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా వెంకటేష్ ఒక చిన్న పాత్రలో కనిపించి సర్‌ప్రైజ్ చేశారు.
ఆ ఇద్దరి కోసం కథ సెట్ చేస్తారా?
ఈ కాంబినేషన్లు వర్కవుట్ చేయడానికి అనీల్ రావిపూడి ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇద్దరు పెద్ద హీరోలను హ్యాండిల్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఎఫ్2, ఎఫ్3 (వెంకీ - వరుణ్ తేజ్), ఎంఎస్‌జి (చిరంజీవి - వెంకటేష్), తదుపరి వెంకీ - కల్యాణ్ రామ్ కాంబినేషన్ సినిమాలే దీనికి నిదర్శనం. వెంకీ- ఎన్బీకే, వెంకీ-నాగ్ ల కోసం మంచి స్క్రిప్టుల్ని వండాల్సి ఉంటుంది.
వెంకటేష్ - నాగార్జున ఇద్దరికీ అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. అనిల్ రావిపూడి మార్క్ హ్యూమర్‌తో వీరిద్దరినీ కలిపి ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లేదా యాక్షన్ కామెడీ ప్లాన్ చేస్తే అది రికార్డులు తిరగరాయడం ఖాయం. గతంలోనే నాగార్జున, వెంకటేష్‌లు ఒక మంచి కథ దొరికితే కలిసి నటిస్తామని చాలాసార్లు చెప్పారు. అనిల్ రావిపూడి ఇప్పుడు ఉన్న ఫామ్‌లో వీరిద్దరి ఇమేజ్‌కు తగ్గట్టుగా ఒక మంచి కథను సిద్ధం చేస్తే బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షమే.
ప్రస్తుతానికి అనిల్ రావిపూడి `వెంకీ - కల్యాణ్ రామ్` ప్రాజెక్టుపై ఫోకస్ చేశారు. ఇది పూర్తయ్యాక నాగ్-వెంకీ కాంబోపై ఆయన దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. ఎన్బీకేతో భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన అనీల్ రావిపూడి భవిష్యత్ లో వెంకీ మామతో ఎన్బీకేని కలిపి సినిమా తీసినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఈ కాంబినేషన్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి.
