అప్పుడు రానా.. ఇప్పుడు మహేష్ ఆదుకున్నారు!
వెంకటేష్ మహా దార్శనికతను మొదటగా గుర్తించి అతడి డెబ్యూ సినిమాకు దగ్గుబాటి రానా తనవంతు సహకారం అందించారు.
By: Sivaji Kontham | 14 Jun 2026 6:52 PM ISTహైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ గల్లీకి సమీపంలో ఒక చిన్న రేకుల షెడ్డులో బ్యాచిలర్ జీవితాన్ని గడుపుతూ, దర్శకుడవ్వాలనే బలమైన సంకల్పంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కుర్రాడు వెంకటేష్ మహా. తను అనుకున్న ఆలోచనలకు అక్షర రూపం ఇస్తూ.. తెలుగు సినిమా స్క్రీన్‌ప్లేలో సరికొత్త వైవిధ్యాన్ని చూపించేందుకు అతడు తపిస్తున్న తీరుకు తగిన అభినందనలు ఎప్పుడూ దక్కుతూనే ఉన్నాయి. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడమే గగనమైన నేటి రోజుల్లో, ఒక ఇండిపెండెంట్ సినిమాగా వైవిధ్యమైన కంటెంట్‌ను నమ్ముకుని ఆయన ప్రయాణించిన తీరు పరిశ్రమలోని అగ్ర హీరోలను సైతం మెప్పిస్తోంది.
వెంకటేష్ మహా దార్శనికతను మొదటగా గుర్తించి అతడి డెబ్యూ సినిమాకు దగ్గుబాటి రానా తనవంతు సహకారం అందించారు. చాలా పరిమిత బడ్జెట్‌లో కొత్తతరం నటీనటులతో రూపొందించిన `కేరాఫ్ కంచరపాలెం` బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. స్టార్ పవర్ లేనిదే థియేటర్లు ఇవ్వని ఆ రోజుల్లో ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న చిత్రంగా విడుదలై నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ ఆనాడు రానా అందించిన అండదండలతో ఆ సినిమా సురక్షితంగా గట్టెక్కింది. అంతేకాకుండా... వెంకటేష్ మహా అనే ఒక ప్రతిభావంతుడైన తెలుగు కుర్రాడిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది.
`కేరాఫ్ కంచరపాలెం` తర్వాత నాలుగైదు సినిమాలు తీసిన వెంకటేష్ మహా ఇప్పుడు సరికొత్త కాన్సెప్ట్‌తో `రావు బహదూర్` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఈ సినిమాలో ఎంతటి బలమైన కంటెంట్ ఉందో నిరూపించింది. అయితే అప్పటికి ఇప్పటికి థియేటర్ల వ్యవస్థలో పెద్దగా మార్పులేవీ రాలేదు. మంచి కథలున్నా చిన్న సినిమాలకు సరైన వేదిక దొరకడం లేదు. ఎవరైనా ఒక పెద్ద హీరో లేదా ప్రతిష్టాత్మక బ్యానర్ వెనుక ఉంటే తప్ప మార్కెట్‌లో వాటిని ఎవరూ పట్టించుకోని పరిస్థితి ఉంది. అందువల్ల ఇలాంటి సినిమాలను రిలీజ్ చేయడం నిర్మాతలకు ఎప్పుడూ పెద్ద రిస్కే అవుతుంది.
కానీ ఇలాంటి క్లిష్ట సమయంలో వెంకటేష్ మహాకు సూపర్ స్టార్ మహేష్ బాబు రూపంలో కొండంత అండ దొరికింది. మహేష్ బాబుకు చెందిన `జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్` సమర్పణలో ఈ సినిమా రిలీజవుతోందనే అధికారిక ప్రకటన రాగానే మార్కెట్ వర్గాల సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. పంపిణీదారులు (డిస్ట్రిబ్యూటర్లు), బయ్యర్లలో ఈ ప్రాజెక్ట్‌పై ఒక్కసారిగా పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఒక అగ్ర కథానాయకుడు ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటంతో ఇప్పుడు థియేటర్ల కోసం వెతుక్కోవాల్సిన పని లేకుండా మంచి ప్రైమ్ ఏరియాల థియేటర్లు, మల్టీప్లెక్స్ స్క్రీన్లు రాత్రికి రాత్రే అందుబాటులోకి వచ్చాయి.
`రావు బహదూర్` లాంటి విలక్షణమైన కంటెంట్‌తో వచ్చే చిత్రాలకు పరిశ్రమ మద్దతు ఎంతైనా అవసరం. ఇలాంటి తరుణంలో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ అండగా నిలవడం మిగతా వారికి కూడా ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. 3 జులై 2026న థియేటర్లలో విడుదల కాబోతున్న `రావు బహదూర్` చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. టాలీవుడ్‌లో చిన్న సినిమాల మనుగడను, వాటి ఆత్మను కాపాడేందుకు స్టార్ హీరోలు ఏ విధంగా అండగా నిలవవచ్చో నిరూపించే ఒక సరికొత్త ప్రయోగం కాబోతోంది. నాడు రానా దగ్గుబాటి, నేడు ఘట్టమనేని మహేష్ బాబు అందించిన ఈ ప్రోత్సాహం ఒక ప్రతిభావంతుడైన దర్శకుడికి లభించిన నిజమైన గౌరవం.
