Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న 'జనవరి 12 విడుదల'లో భారీ యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం కజకిస్థాన్‌లో రియల్ సతీష్ ఆధ్వర్యంలో ఈ ఫైట్‌ను చిత్రీకరిస్తున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

By:  M Prashanth   |   5 Nov 2026 9:42 PM IST
అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..
X

అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా వెంకటేష్‌తో ఆయన తీసిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బాగా వర్కవుట్ అయింది. అయితే ఇప్పుడు 'జనవరి 12 విడుదల' కోసం అనిల్ మరో సర్ ప్రైజ్ రెడీ చేస్తున్నాడు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఏకంగా కజకిస్థాన్‌లో షూటింగ్ చేస్తుండటం విశేషం.

నిజానికి అనిల్ సినిమాల్లో యాక్షన్ కొత్తేమీ కాదు. 'పటాస్', 'సరిలేరు నీకెవ్వరు' లాంటి చిత్రాల్లో ఫైట్స్‌కు మంచి స్పేస్ ఇచ్చారు. కానీ వెంకటేష్‌తో చేసిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాల్లో కామెడీకే ఎక్కువ స్కోప్ ఇచ్చారు. ఇప్పుడు అదే హీరోతో మరో సినిమా చేస్తూ కళ్యాణ్ రామ్‌ను కూడా కలిపి యాక్షన్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నారు. ఈసారి ఇద్దరు హీరోలతో అనిల్ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తారనేది చూడాలి.

ప్రస్తుతం కజకిస్థాన్‌లో జరుగుతున్న షెడ్యూల్‌లో స్టంట్ మాస్టర్ రియల్ సతీష్ ఆధ్వర్యంలో భారీ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఈ సన్నివేశంలో పాల్గొంటున్నారు. అక్కడి కొండలు, మంచు ప్రాంతాలను ఉపయోగించుకుని యాక్షన్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరూ వింటర్ లుక్స్‌లో వీడియోలు ఫొటోలు కూడా బయటకొచ్చాయి.

మరోవైపు ఈ సినిమాలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ బావాబావమరుదులుగా నటిస్తున్నారు. ఈ బంధం చుట్టూ కామెడీ నడిపిస్తూనే ఇద్దరినీ ఒకే యాక్షన్ ఎపిసోడ్‌లో చూపించనున్నారు. పైగా కళ్యాణ్ రామ్‌తోనే 'పటాస్' ద్వారా దర్శకుడిగా పరిచయమైన అనిల్, ఇన్నేళ్ల తర్వాత ఆయనను వెంకీతో కలిపి మల్టీస్టారర్ చేస్తున్నారు.

ఇక కజకిస్థాన్‌లో ఫైట్‌తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారు. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. గతంలో అనిల్ సినిమాల్లో పాటలు, కామెడీ ఎక్కువగా ఇండోర్ సెట్స్, ఫ్యామిలీ నేపథ్యంలో కనిపించేవి. ఇప్పుడు విదేశీ లొకేషన్లను కూడా ఉపయోగించుకుంటూ సినిమా మేకింగ్‌లో కొంత మార్పు చూపిస్తున్నారు.

సాహు గారపాటి నిర్మిస్తున్న 'జనవరి 12 విడుదల'ను 2027 సంక్రాంతికి తీసుకురానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పరిసరాల్లో ప్రధాన చిత్రీకరణ పూర్తయింది. కజకిస్థాన్ షెడ్యూల్ తర్వాత కొద్దిపాటి షూటింగ్ పనులు మిగిలి ఉండగా, నవంబర్ చివరికల్లా చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో పాటలతో ప్రమోషన్లు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.