వెంకీ గోల్డెన్ ఫేజ్ లోడింగ్.. బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడితే..
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే స్టార్ గా విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే.
By: M Prashanth | 19 Jun 2026 4:00 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే స్టార్ గా విక్టరీ వెంకటేష్ కు ప్రత్యేక గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. జెనరేషన్స్ కు తగ్గట్టు కథల సెలెక్షన్ లో మార్పులు చేసుకుంటూ వచ్చిన వెంకీ.. ఇప్పుడు మరోసారి తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ పైనే ఫోకస్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న రెండు ప్రాజెక్టులు కూడా విజయాలు సాధిస్తే వెంకటేష్ కెరీర్ లో గోల్డెన్ స్టేజ్ ప్రారంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.
ఇటీవలే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైంది. వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న ఆ మల్టీస్టారర్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి గతంలో వెంకటేష్ తో చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఆ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. పైగా సంక్రాంతి సీజన్ ను టార్గెట్ చేసుకుని చిత్రాన్ని తీసుకురావాలని మేకర్స్ భావిస్తుండటం విశేషం.
సినిమాలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్ కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్ తో సినిమా ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. కుటుంబ ప్రేక్షకులతో పాటు మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనున్న ఆదర్శ కుటుంబం కూడా హాట్ టాపిక్ గా మారింది. చాలా సంవత్సరాల తర్వాత వెంకటేష్- త్రివిక్రమ్ కాంబో కుదరడంతో ఆ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించిన నేపథ్యంలో ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ఆ సినిమా కూడా పూర్తిగా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగాలు, ఫన్నీ కన్వర్జేషన్స్, వెంకటేష్ కామెడీ టైమింగ్ కలిసి వస్తే ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ అందే అవకాశం ఉంది. ఇప్పటికే షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.
వాస్తవానికి పాన్ ఇండియా ట్రెండ్ జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది స్టార్ హీరోలు భారీ యాక్షన్ కథల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే వెంకటేష్ మాత్రం తన స్త్రెంత్ ను బాగా అర్థం చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే కథలనే ఎంచుకుంటున్నారు. ఇదే ఆయన కెరీర్ లో ఎన్నో విజయాలకు కారణమైంది. ఇప్పుడు చేతిలో ఉన్న ఈ రెండు సినిమాలు కూడా ఫ్యామిలీ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతుండటం హాట్ టాపిక్ గా మారింది.
ఒకవేళ ఆదర్శ కుటుంబం, అనిల్ రావిపూడి సినిమా రెండూ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తే వెంకటేష్ మార్కెట్ మరింత స్ట్రాంగ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు కొత్త దర్శకులు, నిర్మాతలు కూడా ఆయనతో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితి ఏర్పడొచ్చు. ఏదేమైనా ప్రస్తుతం వెంకటేష్ కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో రిజల్ట్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది. ఒకవేళ రెండు సినిమాలు కూడా హిట్ అయితే వెంకీ కెరీర్ లో మరో గోల్డెన్ ఫేజ్ మొదలైందనే చర్చ వినిపించడం ఖాయం.
