'దృశ్యం 3'ని రిజెక్ట్ చేసి వెంకటేష్ మరోసారి ప్రూవ్ చేసుకున్నారా?
వెంకటేష్ కెరీర్‌ను పరిశీలిస్తే? క్రేజ్ కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా ? అని బేరీజు వేసుకుని అడుగులు వేస్తుంటారు.
By: Srikanth Kontham | 5 Oct 2026 10:41 PM ISTటాలీవుడ్‌లో రీమేక్‌లైనా? స్ట్రైట్ సినిమాలైనా ? విక్టరీ వెంకటేష్ కథల ఎంపిక ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో ఆయన జడ్జిమెంట్ ఎంతో మందికి ఆదర్శం. మోహన్‌లాల్ నటించిన కల్ట్ క్లాసిక్ థ్రిల్లర్ `దృశ్యం` సిరీస్‌ను తెలుగులో వెంకటేష్ అంతే ప్రతిష్టాత్మకంగా రీమేక్ చేసి అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అయితే మలయాళంలో `దృశ్యం 3` రావడం సినిమా అక్కడ బాగానే ఆడినా? కొన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవడం.. తాజాగా హిందీలో అజయ్ దేవగన్ చేసిన వెర్షన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధిస్తున్నా? లాజిక్స్ లోపించాయనే చర్చ జరగడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ పరిణామాలన్నింటినీ గమనిస్తుంటే వెంకటేష్ ముందే ఈ కథలో లోపాలను పసిగట్టి `దృశ్యం 3` ప్రాజెక్ట్‌కు దూరంగా ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే పోలీస్ ఆఫీసర్ కొడుకు అదృశ్యం ..శవం చుట్టూ కథను ఎంతని తిప్పగలరు? మొదటి రెండు భాగాల సృష్టించిన మ్యాజిక్ మూడో పార్ట్‌లో కంటిన్యూ కావడం కష్టమని వెంకీ ముందే ఊహించి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే? కథా బలాన్ని సరిగ్గా అంచనా వేయడంలో వెంకటేష్ జడ్జిమెంట్ వంద శాతం కరెక్ట్ అని మరోసారి నిరూపితమైనట్టే.
మలయాళంలో ఒరిజినల్ వెర్షన్ రూపొందించిన దర్శకుడు జీతూ జోసెఫ్ సైతం మూడో భాగాన్ని డీల్ చేయడంలో తడబడ్డారనే విమర్శలు వచ్చాయి. ఇక హిందీలో కమర్షియల్ హంగులతో వసూళ్లు వస్తున్నప్పటికీ సినిమాలో వచ్చే టేప్ రికార్డర్ ట్విస్ట్ .. చర్చి దగ్గర అస్థిపంజరం వెలికితీసే సీన్లలో లాజిక్స్ మిస్ కావడం ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది. నేటి డిజిటల్ యుగంలో ఆడియన్స్ తెలివిమీరిపోయారు. ఏ చిన్న లాజిక్ మిస్ అయినా ?సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అనవసరమైన సాగదీత కథలతో రిస్క్ చేయడం కంటే ప్రాజెక్ట్ చేయకపోవడమే మేలని వెంకటేష్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తోంది.
వెంకటేష్ కెరీర్‌ను పరిశీలిస్తే? క్రేజ్ కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా ? అని బేరీజు వేసుకుని అడుగులు వేస్తుంటారు. `దృశ్యం`, `దృశ్యం 2` చిత్రాలు తెలుగులో సెన్సేషనల్ హిట్స్ కావడంతో మూడో భాగంపై కూడా భారీ అంచనాలు ఉండటం సహజం. కానీ తొలి రెండు భాగాల స్థాయి ఇంటెన్సిటీ మూడో భాగంలో క్యారీ కాకపోవడం వల్ల అనవసరంగా ఫ్రాంచైజీపై ఉన్న మంచి పేరును డ్యామేజ్ చేసుకోవడం ఇష్టంలేకనే ఆయన తెలివిగా సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.
ఒకవేళ వెంకటేష్ గనుక `దృశ్యం 3` చేయడానికి ముందుకు వచ్చి ఉంటే? కథలో ఉన్న లాజికల్ లోపాల కారణంగా ఆయనపై కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉండేది. స్టార్ హీరోగా తన ఇమేజ్‌ను, ప్రేక్షకులకు తనపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీయకుండా పర్ఫెక్ట్ టైమింగ్‌తో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టడం వెంకీ అనుభవానికి నిదర్శనం. కథా బలహీనతలను ముందే గ్రహించి అనవసరమైన ప్రయోగాల జోలికి వెళ్లకుండా ఉండటమే ఒక సీనియర్ హీరో అసలైన పరిపక్వతకు నిదర్శనంగా చెప్పొచ్చు.
