Begin typing your search above and press return to search.

అడివి శేష్‌- సుప్రియ‌పై వెంకీమామ కాంప్లిమెంట్స్

ఈ అబ్బాయి భవిష్యత్తులో ఒక గొప్ప నటుడు అవుతాడని తనకు అనిపించిందని వెంకటేష్ గుర్తు చేసుకున్నారు.

By:  Sivaji Kontham   |   8 April 2026 9:49 AM IST
అడివి శేష్‌- సుప్రియ‌పై వెంకీమామ కాంప్లిమెంట్స్
X

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా `డెకాయిట్` ప్రీ-రిలీజ్ వేడుకలో పాల్గొని చిత్ర యూనిట్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తన సహజసిద్ధమైన శైలిలో వేదికపై సందడి చేసిన వెంకీ డెకాయిట్ విజయంపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేవలం ఒక అతిథిగానే కాకుండా., చిత్ర నిర్మాణ సంస్థ ఎస్.ఎస్. క్రియేషన్స్ తో అనుబంధం.. నిర్మాత సుప్రియ యార్లగడ్డ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సందర్భంగా హీరో అడివి శేష్ ఎదుగుదల గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శేష్ తొలి చిత్రాల్లో ఒకటైన `పంజా`లో అత‌డి నటనను చూసినప్పుడే.. ఈ అబ్బాయి భవిష్యత్తులో ఒక గొప్ప నటుడు అవుతాడని తనకు అనిపించిందని వెంకటేష్ గుర్తు చేసుకున్నారు. అప్పటి తన అంచనా నిజమైందని ప్రస్తుతం శేష్ వరుస విజయాలతో దూసుకుపోతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని కొనియాడారు. `డెకాయిట్` సినిమా శేష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సినిమా కంటెంట్ గురించి మాట్లాడుతూ.. ట్రైలర్ చూడగానే ఇదొక విభిన్నమైన లవ్ స్టోరీ అని అర్థమవుతోందని వెంకటేష్ అన్నారు. ఒక ప్రేమకథలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, బలమైన ఎమోషన్స్ కలగలిపి ఉండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని వెంకీ పేర్కొన్నారు. ఇంతటి వైవిధ్యమైన కథాంశాన్ని ఎంచుకున్నందుకు చిత్ర బృందాన్ని అభినందిస్తూ.. సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుందని ఎటువంటి సందేహం లేకుండా చెప్పారు. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటనను ప్రశంసిస్తూ.. త‌న‌ కెరీర్‌లో ఇది ఒక ఉత్తమ చిత్రమవుతుందని అన్నారు.

నిర్మాత సుప్రియ యార్లగడ్డ పట్టుదలను వెంకటేష్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. తాను ఈ వేడుకకు రావడానికి ప్రధాన కారణం తన ఫేవరెట్ సురేంద్ర మావయ్య అని.. ఆయన బ్యానర్‌లో సుప్రియ ఇంత అద్భుతమైన చిత్రాన్ని నిర్మించడం సంతోషకరమని అన్నారు. సినిమా ప్రారంభం నుండి ఈ టీమ్‌లో ఒక మంచి `వైబ్` .. ప్యాషన్ కనిపిస్తోందని.. ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని అందించాలనే క్రమశిక్షణతో ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని వెంక‌టేష్ చిత్ర బృందాన్ని అభినందించారు.

చివరగా ఎస్.ఎస్. క్రియేషన్స్ భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలను అందుకోవాలని వెంకటేష్ ఆకాంక్షించారు. చిత్రంలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్లందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ తన ప్రసంగాన్ని ముగించారు. సీనియర్ హీరో వెంకటేష్ స్వయంగా వచ్చి ఇలా ప్రోత్సహించడం `డెకాయిట్` చిత్ర బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఏప్రిల్ 10 న డెకాయిట్ అత్యంత భారీగా విడుదల‌వుతోంది.