వెంకీ ఇంతకుముందు చేసిన క్యామియోలలో ఏది హిట్టు.. ఏది ఫట్టు?
విక్టరీ వెంకటేశ్ టాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ లో 76 సినిమాల్లో హీరోగా అలరించారు.
By: M Prashanth | 24 Oct 2025 5:00 AM ISTవిక్టరీ వెంకటేశ్ టాలీవుడ్ లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. దాదాపు నాలుగు దశాబ్దాల కెరీర్ లో 76 సినిమాల్లో హీరోగా అలరించారు. అయితే వెంకీ ప్రత్యేకత ఏంటంటే.. అంతటి స్టార్ హీరోగానే కాకుండా వేరే హీరోల సినిమాలో ఏదో ఒక రకంగా భాగం అయ్యేవారు. అలా తన సుదీర్ఘ కెరీర్ లో చైల్డ్ ఆర్టిస్ట్, స్పెషల్ అప్పియరెన్స్, ప్లే బ్యాక్ సింగర్, వాయిస్ ఓవర్ క్రెడిట్ ఇలా పలు రకాలుగా సినిమాల్లో భాగం అయ్యారు.
మరీ ముఖ్యంగా ఏ హీరోతోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే వెంకీ అస్సలు ఆలోచించరు. కథ నచ్చితే వెంటనే ఓకే చేసేస్తారు. అది మల్టీస్టారర్ అనే కాదు. క్యామియో రోల్ అయినా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. ఆయన కెరీర్ లో ఇలా సినిమాల్లో కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా మరోసారి ఓ సినిమాలో క్యామియో రోల్ చేసేందుకు సిద్ధమయ్యారు వెంకటేశ్ దగ్గుబాటి. మెగాస్టార్ లీడ్ రోల్ లో నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేశ్ క్యామియో రోల్ చేయనున్నారు.
ఆయనకు సెట్స్ లోకి స్వాగతం పలుకుతూ మెగాస్టార్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇద్దరూ తెలుగులో స్టార్ హీరోలు. తెరంగేట్రం చేసి దశాబ్దాలు గడుస్తున్నా.. ఒక్కసారి కూడా చిరు- వెంకీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. దీంతో అటు మెగా, ఇటు దగ్గబాటి అభిమానుల్లో సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో వెంకీ గతంలో చేసిన క్యామియో, ఎక్స్ టెండ్ క్యామియో రోల్స్ ఏమున్నాయని ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. మరి వాటిపై ఓ లుక్కేద్దామా?
1971లో వెంకటేశ్ బాలనటుడిగా తొలిసారి వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ జయమ్ము నిశ్చయమ్మురా (1989) సినిమాలో తొలిసారి క్యామియో రోల్ చేశారు. జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అలా వెంకటేశ్ హీరోగానే కాకుండా క్యామియో కూడా చేసి విజయం అందుకున్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లకు మళ్లీ మేనళ్లుడు అక్కినేని నాగచైతన్య కోసం క్యామియో ఒప్పుకున్నారు.
2016లో చైతన్య హీరోగా వచ్చిన ప్రేమమ్ లో వెంకీ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. ఈ సినిమా కూడా మంచి విజయం దక్కించుకుంది. ఆ తర్వాత రెండేళ్లకు పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలోనూ మెరిశారు. కానీ ఇది మిస్ ఫైర్ అయ్యింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా డీలా పడింది. ఇక మూడేళ్ల కిందట యువ కథానాయకుడు విష్వక్ సేన్ కోసం క్యామియో చేశారు.
ఓరి దేవుడా సినిమాలో ఎక్స్ టెండ్ క్యామియోలో కనిపించారు. కానీ ఇది కూడా ఫెయిల్ అయ్యింది. అలా కెరీర్ లో ఇప్పటిదాకా నాలుగు సినిమాల్లో క్యామియో, ఎక్స్ టెండ్ క్యామియో రోల్స్ చేస్తే.. అందులో రెండు హిట్ అయ్యాయి. మరో రెండు ఫట్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ పంచుకోవడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి కావడంతో దీనిపై ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
