AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకుంటోంది.
By: Priya Chowdhary Nuthalapti | 4 Nov 2026 11:14 PM ISTత్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనిపించుకుంటోంది. ఈ సినిమా కొంతమంది ప్రేక్షకులను ఒక మోస్తారుగా మెప్పించినప్పటికీ..మరికొందరి నుంచి మాత్రం నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ముఖ్యంగా కథలో మొదటి భాగం నుంచి రెండో భాగానికి వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాకి పెద్ద దెబ్బ కొట్టినట్టు కనిపిస్తోంది.
సినిమా మొదటి భాగంలో త్రివిక్రమ్ ఒక సాధారణ.. మధ్యతరగతి కుటుంబాన్ని చూపించారు. వంటలు సరిగ్గా రాని భార్య, తెలివి తక్కువ పిల్లలు, ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న గొడవలు.. ఇలా ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో కనిపించే పరిస్థితులను తెరపైకి తీసుకొచ్చారు. ఈ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య జరిగే సరదా సన్నివేశాలు.. అనిల్ రావిపూడి స్టైల్లో బాగానే రాసుకోవడంతో.. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా తీశారు గురుజీ. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది.. అదేమిటంటే ఫస్ట్ హాఫ్.. యూత్ లేదా డిఫరెంట్ జోనర్ చూడాలన్న ప్రేక్షకులకు పెద్దగా ఎక్కదు.
ఇక అసలు సమస్య సెకండ్ హాఫ్ లో మొదలవుతుంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం.. ఒక సాధారణ కుటుంబ కథలా సాగితే, సెకండ్ హాఫ్‌లో సినిమా ఒక్కసారిగా క్రైమ్ థ్రిల్లర్‌గా మారిపోతుంది. అప్పటివరకు మనం చూసిన కుటుంబం వెనుక మరో కథ ఉందని చూపిస్తారు. ఒక రకంగా అసలు ఇది కుటుంబ కథే కాదని చెప్పేస్తారు.
ఈ మార్పు గురూజీ పెట్టింది సస్పెన్స్ కోసమే లేకపోతే ట్విస్ట్ కోసమే అయినా, ప్రేక్షకులు మాత్రం ఒక్కసారిగా మరో జోనర్లోకి వెళ్లిన ఫీలింగ్ వచ్చేస్తుంది. మొదటి భాగంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు, రెండో భాగంలో సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో సెకండ్ హాఫ్ మొత్తం ఏదో థ్రిల్లర్ సినిమా చూసే వాళ్ళకి పర్వాలేదు అనిపిస్తుంది.. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కదు.
ఒకే సినిమాలో రెండు విభిన్నమైన జోనర్లను కలపడం తప్పు కాదు. కానీ ఆ మార్పు అనేది ప్రేక్షకులకు సహజంగా అనిపించాలి. ఇక్కడ మాత్రం మొదటి భాగానికి, రెండో భాగానికి మధ్య ఉన్న తేడ మరి ఎక్కువగా అనిపిస్తుంది. వెంకటేష్ సినిమా అంతే కాలక్షేపానికి వచ్చే ప్రేక్షకులు.. బుర్రని మొదటి హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కి ఇంతలా మార్చాలి అంటే కష్టమే.
త్రివిక్రమ్ అ..ఆ.. ఫస్ట్ హాఫ్, జులాయి సెకండ్ హాఫ్ ఒకే సినిమాలో పెట్టడానికి చేసిన ప్రయత్నం.. ఇలా అయిపోయిందేమో అని మనకి అభిప్రాయం రాక మానదు. ఒక సినిమా ప్రేక్షకులకు నచ్చాలి అంటే.. ఒక జోనర్ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఎక్కువగా ఉండాలి. కానీ మన గురూజీ.. మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని జోనర్లు ఒకే సినిమాలో పెట్టడానికి ట్రై చేసినట్టు అయిపోయింది ఆదర్శ కుటుంబం పరిస్థితి.
త్రివిక్రమ్ తనదైన మాటలు, ప్రాసలతో ఆకట్టుకున్నప్పటికీ, కథ విషయంలో మాత్రం మరింత జాగ్రత్త తీసుకోవాల్సింది. మొత్తానికి ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఇంచ్ దూరంలో.. యూత్ కి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక గురూజీ అభిమానులకు.. “చూడకపోతే బాధ.. చూస్తే వ్యథ” అనేలా మారింది. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏమిటో ఈ వారం ఆగితే కానీ తెలియదు.
