Begin typing your search above and press return to search.

ఇరుముడి.. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' ఎక్కడ ఆగుతుందో!

కామెడీ సినిమాలకు కొన్ని సందర్భాల్లో మరో ప్లస్ ఉంటుంది. సీన్స్ బాగా పడితే ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ ఫ్యామిలీతో వెళ్లే అవకాశం ఉంటుంది.

By:  M Prashanth   |   2 Oct 2026 11:00 AM IST
ఇరుముడి.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం ఎక్కడ ఆగుతుందో!
X

ఇరుముడి రూ.200 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం ఇప్పటివరకు రవితేజ కెరీర్‌కే అతిపెద్ద రికార్డు. ఆ సినిమాకు తండ్రి కూతురు ఎమోషన్ ప్లస్ అయ్యాయి. థ్రిల్లర్ టచ్ ఉన్నా చివరికి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగా హైలెట్ చేశారు. పాజిటివ్ మౌత్ టాక్ వచ్చాక వీకెండ్‌తో ఆగకుండా తర్వాతి రోజుల్లో కూడా వసూళ్లు పెరిగాయి. ఇప్పుడు వెంకటేష్ ఆదర్శ కుటుంబం హౌస్ నం.47 కూడా అదే ఫ్యామిలీ సెక్షన్‌ను టార్గెట్ చేస్తోంది.

కానీ ఈసారి టోన్ కొంచెం వేరుగా ఉంది. ఆదర్శ కుటుంబంలో కామెడీకి మంచి స్పేస్ కనిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో ఇంటి సన్నివేశాలు, మాటలతో వచ్చే కామెడీ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. వెంకటేష్ టైమింగ్ కూడా దానికి కలిస్తే ఫ్యామిలీస్‌తో పాటు యూత్ కూడా ఈజీగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ సినిమా ఈజీగా రూ.200 కోట్లు.అందుకుంటుంది అనేలా కామెంట్స్ వస్తున్నాయి.

కామెడీ సినిమాలకు కొన్ని సందర్భాల్లో మరో ప్లస్ ఉంటుంది. సీన్స్ బాగా పడితే ఒకసారి చూసిన వాళ్లు మళ్లీ ఫ్యామిలీతో వెళ్లే అవకాశం ఉంటుంది. పిల్లలు, పెద్దలు కలిసి చూడగలిగే సినిమా అయితే షోలు ఎక్కువ రోజులు నిలబడతాయి. ఇరుముడి ఎమోషన్‌తో ఆడియన్స్‌ను పట్టుకుంటే, ఆదర్శ కుటుంబం నవ్వులతో అదే పని చేయగలదా అన్నది ఇక్కడ అసలు పాయింట్.

వెంకటేష్‌కు ఈ సెక్షన్ బాగా అలవాటే. సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఎంత పెద్ద రన్ తీసుకెళ్లిందో చూశాం. ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా కావడంతో కామెడీ ఒక్కటే ఉండే అవకాశం లేదు. టీజర్‌లో కుటుంబ సమస్య, యాక్షన్ ఛాయలు కూడా కనిపించాయి. త్రివిక్రమ్ సాధారణంగా సరదా సన్నివేశాల మధ్య బరువైన ఎమోషన్‌ను కూడా తీసుకొస్తారు.

ఇరుముడికి మొదటి రోజు కంటే తర్వాత వచ్చిన మౌత్ టాక్ ప్రచారమే ఎక్కువ ఉపయోగపడింది. ఆదర్శ కుటుంబం కూడా పెద్ద వసూళ్లకు వెళ్లాలంటే శనివారం, ఆదివారం తర్వాత సోమవారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. కామెడీ సీన్స్ సోషల్ మీడియాలో తిరిగితే మరో ప్లస్. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ మొదటి రోజుకు ఉపయోగపడుతుంది, ఆ తర్వాత కథే సినిమాను మోయాలి.

అక్టోబర్ 9న ఆదర్శ కుటుంబం వస్తోంది. ఆరు రోజులకే జైలర్ 2 ఉండటంతో మొదటి వారంలోనే ఎక్కువ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అయినా ఫ్యామిలీ సినిమాలకు షోలు తగ్గినా నిలబడే అవకాశం ఉంటుంది. ఇరుముడి రూ.200 కోట్లు దాటిన తర్వాత ఇప్పుడు ఆదర్శ కుటుంబం కూడా అదే రేంజ్‌ను అందుకుంటుందో లేదో చూడాలి.