Begin typing your search above and press return to search.

వెంకటేష్ సినిమా కోసం కాలేజీకి సెలవు.. ఫస్ట్ డే సినిమా చూడాలని కండిషన్!

సినిమా విడుదలైన మొదటి రోజే అందరూ థియేటర్లలో సినిమా చూస్తామని మాట ఇస్తే, ఆ రోజు కాలేజీకి సెలవు ప్రకటిస్తానని చెప్పారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   23 Oct 2026 10:07 PM IST
వెంకటేష్ సినిమా కోసం కాలేజీకి సెలవు.. ఫస్ట్ డే సినిమా చూడాలని కండిషన్!
X

విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదర్శ కుటుంబం – హౌస్ నంబర్ 47. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 30, 2026న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కంటే ముందే ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకటేష్ సినిమా కోసం ఒక కాలేజీకి సెలవు ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది.

ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా.. మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్, మల్లారెడ్డి యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ ప్రీతి రెడ్డి విద్యార్థులతో సరదాగా మాట్లాడారు.

వెంకటేష్ నటించిన ఆదర్శ కుటుంబం సినిమాను థియేటర్లలో చూడాలని ఉందా అని ఆమె.. అక్కడ కాలేజీలోని విద్యార్థులను అడిగారు. దీంతో విద్యార్థులు తమకు సినిమా చూడాలని ఉందని ఉత్సాహంగా స్పందించారు. వెంటనే ప్రీతి రెడ్డి ఒక ఆసక్తికరమైన షరతు పెట్టారు.

సినిమా విడుదలైన మొదటి రోజే అందరూ థియేటర్లలో సినిమా చూస్తామని మాట ఇస్తే, ఆ రోజు కాలేజీకి సెలవు ప్రకటిస్తానని చెప్పారు. ఈ ప్రకటనతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇచ్చిన మాటను నమ్మి, సినిమా విడుదల రోజున సెలవు ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

దీంతో వెంకటేష్ సినిమా కోసం కాలేజీకి సెలవు అనే విషయం ఇప్పుడు తెగ వైరల్ అయిపోతుంది. సాధారణంగా సినిమాల విడుదల సందర్భంగా అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తుంటారు. ఇక్కడేమో ఒక కాలేజీలో విద్యార్థులు సినిమా చూడటానికి సెలవు ప్రకటించడం మాత్రం ఆసక్తికరంగా మారింది.

వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మరో సినిమా కావడంతో ఆదర్శ కుటుంబంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా విడుదల కానుండి.