ఆదర్శ కుటంబం.. రూమర్లు నిజమేనా?
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ మేకింగ్ దశలో ఉండగా ఒక రూమర్ హల్‌చల్ చేయడం గుర్తుండే ఉంటుంది.
By: Garuda Media | 1 Oct 2026 4:54 PM ISTవిక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ మేకింగ్ దశలో ఉండగా ఒక రూమర్ హల్‌చల్ చేయడం గుర్తుండే ఉంటుంది. కొన్ని నెలల ముందు తమిళ, తెలుగు భాషల్లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సర్ప్రైజ్ హిట్ అయిన ‘బ్లాస్ట్’ సినిమా కథతో దీనికి పోలిక ఉందని.. దీంతో కొన్ని రోజులు షూటింగ్ ఆపి, త్రివిక్రమ్ స్క్రిప్టును మార్చారని.. తన సంస్థ నుంచే ‘బ్లాస్ట్’ను రిలీజ్ చేసినప్పటికీ నాగవంశీ ఆ చిత్రాన్ని పెద్దగా ప్రమోట్ చేయకపోవడానికి ‘ఆదర్శ కుటుంబం’తో ఉన్న పోలిక కూడా ఒక కారణమని అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
మరి ఈ ప్రచారంలో నిజం ఎంత అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు. ఐతే ‘ఆదర్శ కుటుంబం’ ప్లాట్ పాయింట్ గురించి ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాటలు చూస్తే.. ‘బ్లాస్ట్’తో కొంత పోలిక ఉన్న మాట వాస్తవమే అనిపిస్తోంది. ‘ఆదర్శ కుటుంబం’ థీమ్ గురించి చెబుతూ.. త్రివిక్రమ్ బ్లాక్ స్వాన్ అనే ఎఫెక్ట్ గురించి చెప్పారు. ఇందుకు ఆయన కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. రెండు దేశాల యుద్ధం జరుగుతుంటే.. అది రెండు దేశాల వ్యవహారం అనుకుంటారని, కానీ ఈ రెండు దేశాల్లో ప్రజలు ఉంటారని, దీని వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది వాళ్లే అని, ఒకవేళ వారికి మాట్లాడే అవకాశం ఉంటే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరమని.. అలాగే తెలివిగా ఇద్దరు కలిసి ఒక గేమ్ ప్లాన్ చేస్తే.. ఒక కార్నర్ నుంచి మూడో వ్యక్తి వచ్చి గేమ్‌ను కంట్రోల్‌లోకి తీసుకుంటే ఎలా ఉంటుందన్నది ఇంట్రెస్టింగ్ అని త్రివిక్రమ్ వివరించాడు.
ఒక అద్భుతమైన బిజినెస్ ప్లాన్ చేస్తే ఒక చిన్న లోపం వల్ల మొత్తం కొలాప్స్ అయిపోవచ్చని.. 2020లో ఒక గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా తీస్తే కరోనా వచ్చి అంతా నాశనం అయిపోతుందని.. ఇలా ఊహించని కోణాన్నే ‘బ్లాక్ స్వాన్’ అంటారని త్రివిక్రమ్ వివరించారు. ‘ఆదర్శ కుటుంబం’ కథ కూడా ఇలాగే సాగుతుందని ఆయన చెప్పారు. ‘బ్లాస్ట్’ సినిమా కథను ఒకసారి పరిశీలిస్తే.. ఒక పెద్ద బిజినెస్‌మ్యాన్ ఒక ఊరిని నాశనం చేసి మైనింగ్ చేసుకోవాలని చూస్తే.. ఊహించని విధంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ వ్యవహారంలోకి ఎంటరై విలన్ సామ్రాజ్యాన్ని కూల్చేస్తుంది. ఈ రకంగా చూస్తే ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి కూడా పోలిక ఉన్నట్లుంది. కానీ త్రివిక్రమ్ నరేషన్ స్టైల్ వేరు కాబట్టి.. ఆ పోలిక పెద్ద ఇబ్బంది కలిగించకపోవచ్చు.
