కష్టాలు చూసిన కాశ్మీర్‌కు.. గుండెలకు హత్తుకునే కథతో వేదాంగ్!
బాలీవుడ్ లో తనదైన నటనతో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు వేదాంగ్ రైనా ఇటీవల కాశ్మీర్ పర్యటనలో భాగంగా భావోద్వేగానికి గురయ్యారు.
By: Srikanth Kontham | 15 Sept 2026 5:00 PM ISTబాలీవుడ్ లో తనదైన నటనతో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువ నటుడు వేదాంగ్ రైనా ఇటీవల కాశ్మీర్ పర్యటనలో భాగంగా భావోద్వేగానికి గురయ్యారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్‌లో ఆయన నటించిన `మైన్ వాపస్ ఆవుంగా` చిత్రం ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా వేదాంగ్ పంచుకున్న విషయాలు, కాశ్మీర్ ప్రజలతో ఆయనకున్న అనుబంధం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతోంది.
చాలా ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలను, అశాంతిని చవిచూసిన కాశ్మీర్ లోయకు ఒక ఆత్మీయమైన కౌగిలింతలా `మైన్ వాపస్ ఆవుంగా` సినిమా నిలిచింది. సొంత ప్రాంతాన్ని, తమ మూలాలను వదిలి వెళ్ళవలసి వచ్చిన మానసిక వేదన మళ్లీ తమ సొంత గడ్డపైకి తిరిగి రావాలనే ఆరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో వేదాంగ్ నటన అక్కడి ప్రేక్షకులకు ఎంతగానో కలచివేసింది.. కంటితడి పెట్టించింది.
ప్రదర్శన సమయంలో వేదాంగ్ రైనా కశ్మీరీ మూలాలను గుర్తు చేసుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. `మైన్ వాపస్ ఆవుంగా` కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. అది కాశ్మీర్ ప్రజల హృదయ స్పందనకు అద్దం పట్టే కథ అని పేర్కొన్నారు. స్క్రీన్‌పై కథను చూసుకున్న స్థానిక ప్రజలు చూపించిన ప్రేమ, అందించిన ఆదరణ తన జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయని వేదాంగ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో కాశ్మీర్ లోయల అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదించడంతో పాటు స్థానిక సంస్కృతికి, అక్కడి రుచికరమైన `వాజ్వాన్` వంటకాలకు ఫిదా అయినట్లు వేదాంగ్ గుర్తు చేసుకున్నారు. కాశ్మీర్‌లో సినిమా సంస్కృతి.. థియేటర్ల వ్యవస్థ మరింత వేగంగా విస్తరించాలని, స్థానిక యువతకు చలనచిత్ర రంగం ద్వారా మరిన్ని అవకాశాలు రావాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు.
కళాత్మక చిత్రాలకు, లోతైన కథనాలకు పెట్టింది పేరు అయిన ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ మార్గదర్శకత్వంలో కాశ్మీర్ నేపథ్యంగా ఓ పూర్తి స్థాయి సినిమాలో నటించడం తన అతిపెద్ద కల అని వేదాంగ్ రైనా ఆకాంక్షను వెల్లడించారు. కాశ్మీర్ అందాలను, అక్కడి ప్రజల అంతర్మథనాన్ని వెండితెరపై ఆవిష్కరించే కథల్లో భాగం కావాలని భావిస్తున్నారు.
మొత్తానికి తీవ్రమైన ఘర్షణలు , కష్టాల కాలం గుండా వెళ్లిన కాశ్మీర్‌కు వేదాంగ్ రైనా నటించిన `మైన్ వాపస్ ఆవుంగా` గుండెలకు హత్తుకునే ప్రేమలేఖలా మారింది. యువ తరం నటులు ఇలాంటి ఎమోషనల్ , సామాజిక ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ మూలాలను గౌరవించడం పరిశ్రమలో నిజంగా అభినందించదగిన పరిణామం.
