ఐటీ రైడ్స్ మధ్య ఆసుపత్రిపాలైన బాలీవుడ్ నిర్మాత!
సినిమా రంగంలో ఆర్థికపరమైన అక్రమాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ఐటీ శాఖ ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
By: Srikanth Kontham | 30 Sept 2026 12:50 PM ISTబాలీవుడ్ నిర్మాత వాషు భగ్నానీ తీవ్ర అనారోగ్యంతో లండన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. పూజా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ ఆసుపత్రిపాలవడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ ఈ పరిణామం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఆసుపత్రి చేరిక వెనుక కీలకమైన పరిణామాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ముంబైకి చెందిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు వాషు భగ్నానీకి సంబంధించిన కార్యాలయాలు, నివాసాలతో పాటు సుమారు 12 ప్రాంతాలలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. సినిమాల నిర్మాణానికి సంబంధించిన విదేశీ నిధులు, ఆర్థిక లావాదేవీలు , నిధుల మళ్ళింపులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ రైడ్స్ జరిగినట్లు వార్తలు వచ్చాయి.
సినిమా రంగంలో ఆర్థికపరమైన అక్రమాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహంపై ఐటీ శాఖ ఉక్కుపాదం మోపుతున్న తరుణంలో ఈ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వాషు భగ్నానీతో పాటు పనోరమా స్టూడియోస్, కుటుంబ సభ్యులకు సంబంధించిన పలు ప్రాంతాలపై కూడా ఐటీ అధికారులు దృష్టి సారించారు. ఈ విచారణకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
అయితే లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాషు భగ్నానీని మీడియా ప్రతినిధులు సంప్రదించగా, ఆయన ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు నిరాకరించారు. తనను ఒంటరిగా వదలాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరినట్లు మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఊహించని పరిణామాలు , ఐటీ విచారణ నేపథ్యంలో భగ్నానీ కుటుంబం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
వాషు భగ్నానీ కెరీర్‌లో `కూలీ నెం. 1`, `హీరో నెం. 1`, `బీవీ నెం. 1`, `రెహనా హై తే దిల్ మే` వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ బాధ్యతలను ఆయన కుమారుడు జాకీ భగ్నానీ చూసుకుం టున్నారు. ఇటీవలి కాలంలో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో సంస్థ నష్టాల్లో కి వెళ్లిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది.
ఒకవైపు ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు వేగవంతం కావడం.. మరోవైపు సీనియర్ నిర్మాత వాషు భగ్నానీ ఆసుపత్రిపాలవడం బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. విచారణలో ఐటీ అధికారులు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వాషు భగ్నానీ ఆరోగ్యంపై ఎలాంటి అప్‌డేట్స్ వస్తుందో? చూడాలి.
