స్కూల్ పిల్లలలో హద్దు మీరిన హింస.. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలతో!
గుజరాత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హార్రర్ మూవీ వష్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ మొదలయ్యింది.
By: Madhu Reddy | 29 Aug 2025 10:39 AM ISTగుజరాత్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హార్రర్ మూవీ వష్ గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ మొదలయ్యింది. ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యాలతో.. స్కూల్ పిల్లలతో చేయించిన హింసాత్మక ఘటనలు అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా భయానికి గురిచేస్తున్నాయి. 2023లో విడుదలైన ఈ సినిమా అక్కడ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఊహించని కలెక్షన్లు సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సక్సెస్ ఏ స్థాయిలో ఉందంటే బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఏరికోరి మరి ఈ సినిమాను సైతాన్ గా రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నారు.
ముఖ్యంగా స్కూల్ పిల్లలే టార్గెట్ గా చేసుకొని ఒక మాంత్రికుడు వశీకరణ విద్య ద్వారా వారిని లోబరుచుకొని.. వారి జీవితాలతో ఎలా ఆడుకున్నాడు..? చివరికి అందులో ఒక అమ్మాయి తండ్రి ఏం చేశాడు?!అనే పాయింట్ మీద ఈ సినిమాను రూపొందించడం జరిగింది. దీనికి సీక్వెల్ గా ఇప్పుడు వష్ లెవెల్ 2 విడుదల అయ్యింది. ఇటీవల ఈ చిత్ర నుండీ ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఈసారి రీమేక్ కి అవకాశం ఇవ్వకుండా హిందీలో కూడా డబ్బింగ్ చేసి ఒకేసారి రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మొదటి భాగంతో పోల్చుకుంటే ఈసారి ఇంకొంచెం ఎక్కువ షాకింగ్ కంటెంట్ తో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది.
ఇక సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఒక పెద్ద స్కూల్లో చదువుకునే పదిమంది అమ్మాయిలు పాఠశాల టెర్రస్ పైకెక్కి ఒక్కసారిగా దూకి ఆత్మహత్య చేసుకుంటారు. ఇంకొంతమంది అమ్మాయిలు ఒకరికొకరు వశీకరణ చేసుకుంటూ ఇతరులపై దాడి చేస్తారు. ఇంకొంతమంది ఊరి మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా అత్యంత దారుణంగా చంపేస్తూ ఉంటారు. ఇదంతా చేస్తోంది వష్ మొదటి భాగంలో మాంత్రికుడి శిష్యుడని తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెరపై చూడాల్సిందే.
ఈ సినిమా నిడివి కేవలం 1గంట 35 నిమిషాలే కానీ ఊహించని స్థాయిలో తెరకెక్కించిన అంశాలు ఆద్యంతం ఊపిరి బిగబట్టేలా చేస్తాయి. ముఖ్యంగా ఒక్కొక్క సన్నివేశం ప్రేక్షకుడిని సీటు చివరంచున కూర్చోబెడుతుంది అనడంలో సందేహం లేదు. ఇందులోని కొన్ని ఎపిసోడ్స్ నిజంగా భయంకరంగా అనిపిస్తాయి. పైగా స్కూల్ పిల్లలు చనిపోవడం.. వాళ్లతో చేయించిన హింస కొంచెం హద్దులు దాటిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బుక్ మై షో లో ట్రెండింగ్ లో ఉన్న ఈ హార్రర్ మూవీకి కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి పార్ట్ 3 కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కృష్ణదేవ్ యాగ్నిక్ తెరకెక్కించారు.
