Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : తండ్రి అయ్యాక లుక్‌ మార్చిన మెగాహీరో

సాధారణంగానే వరుణ్‌ తేజ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఉంటాడు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా వరుణ్‌ తేజ్‌ అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తున్నాయి.

By:  Ramesh Palla   |   17 Oct 2025 12:12 PM IST
పిక్‌టాక్‌ : తండ్రి అయ్యాక లుక్‌ మార్చిన మెగాహీరో
X

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ సినిమాల పరంగా కాస్త ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. అయితే వ్యక్తిగతంగా మాత్రం ఆయన ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇటీవలే తండ్రి అయిన వరుణ్‌ తేజ్‌ పూర్వ ఉత్తేజంతో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. గత నెలలో వరుణ్‌ తేజ్‌ భార్య లావణ్య త్రిపాఠి కొడుకుకు జన్మనిచ్చింది. ఇటీవలే దసరా సందర్భంగా వరుణ్‌ తేజ్ దంపతులు తమ కొడుకుకి వాయువ్ తేజ్ కొణిదెల అనే పేరు పెట్టారు. కొడుకు పుట్టిన సమయంలో సినిమాలకు బ్రేక్‌ తీసుకున్న వరుణ్‌ తేజ్‌ తిరిగి షూటింగ్‌కు హాజరు కాబోతున్నాడు. తన తదుపరి సినిమాకు సంబంధించిన పనులతో, రాబోయే సినిమాల కోసం స్క్రిప్ట్‌ వింటూ వరుణ్‌ తేజ్ బిజీ బిజీ అయ్యాడు. ఈ సమయంలో ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ పోటో వైరల్‌ అవుతోంది.


వరుణ్‌ తేజ్ స్టైలిష్ లుక్‌ వైరల్‌

సాధారణంగానే వరుణ్‌ తేజ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఉంటాడు. ఈసారి అంతకు మించి అన్నట్లుగా వరుణ్‌ తేజ్‌ అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో కనిపిస్తున్నాయి. క్లోజప్‌లో వరుణ్‌ తేజ్‌ ఏకంగా బాలీవుడ్‌, హాలీవుడ్‌ రేంజ్‌లో ఉన్నాడంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గుబురు గడ్డం, మీసాలు, పెరిగిన జుట్టు, స్టైలిష్‌ గాగుల్స్‌, అంతకు మించి స్టైలిష్ ఔట్‌ ఫిట్‌లో వరుణ్‌ తేజ్‌ను చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండాలి అనిపిస్తుందని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. సాధారణంగానే వరుణ్‌ తేజ్‌ సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలు షేర్‌ చేసిన సమయంలో మెగా ఫ్యాన్స్‌ తెగ లైక్ చేయడంతో పాటు కామెంట్స్ చేస్తూ షేర్‌ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో వరుణ్‌ లుక్‌ ఇలా ఉంటే బాగుంటుందని చాలా మంది అంటున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ 15వ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా తో వరుణ్ తేజ్‌ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తారని తెలుస్తోంది. ఇప్పటికే పలు టైటిల్స్‌ను పరిశీలించిన మేకర్స్ త్వరలోనే ఒక టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేసి, విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొదట షూటింగ్‌ ప్రారంభించిన సమయంలో సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని అనుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. సినిమా కథ అనుసారం ఎక్కువ శాతం షూటింగ్‌ విదేశాల్లో చేస్తున్నారు. అందుకు కారణం ఏంటి అనేది సినిమా చూస్తే అర్థం అవుతుందని మేకర్స్ అంటున్నారు. మేర్లపాక గాంధీ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మట్కా సినిమాతోనూ నిరాశే

గత సంవత్సరం వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా నిరాశనే మిగిల్చాయి. కానీ మట్కా సినిమాలో వరుణ్‌ తేజ్‌ నటనకు మంచి మార్కులు దక్కాయి. ముఖ్యంగా ఆయన గెటప్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అంటూ అభినందనలు దక్కించుకున్నాడు. మట్కా సినిమా మంచి కంటెంట్‌ ఉన్న సినిమా అని, ప్రేక్షకులు ఎందుకు తిరస్కరించారో అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ మాట్లాడుతూ ఉంటారు. వరుణ్ తేజ్‌ కమర్షియల్‌ హిట్‌ కొట్టి చాలా కాలం అయింది. మరి మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో అయినా విజయాన్ని సొంతం చేసుకుంటాడా అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ దశలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే సినిమా నుంచి టీజర్‌ విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.