ఆ డైరెక్టర్ తో వరుణ్ రిస్క్ చేస్తున్నాడా?
మెగా ప్రిన్స్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ టైమ్ ఇప్పుడస్సలు బాలేదు. ఆయన ఏ సినిమా చేసినా మంచి రిజల్ట్ ఉండట్లేదు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Oct 2025 12:22 PM ISTమెగా ప్రిన్స్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ టైమ్ ఇప్పుడస్సలు బాలేదు. ఆయన ఏ సినిమా చేసినా మంచి రిజల్ట్ ఉండట్లేదు. ఎన్ని ప్రయోగాలు చేసినా వర్కవుట్ అవకపోగా, బెడిసికొడుతున్నాయి. వరుణ్ తేజ్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ఎప్పటికప్పుడు ఈ సినిమాతో హిట్ కొట్టాల్సిందేనని కసిగా పనిచేయడం తప్పించి మంచి ఫలితం మాత్రం లభించడం లేదు.
మేర్లపాక గాంధీతో కొరియన్ కనకరాజు
అందుకే కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు వరుణ్. ఇకపై కాస్త లేటైనా ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలే చేయాలని డిసైడ్ అయిన వరుణ్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కేవలం యాక్షన్ జానర్ లోనే కాకుండా కామెడీ ప్రధానంగా ఉంటుందని మేకర్స్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు.
కొరియన్ కనకరాజు 80% షూటింగ్ పూర్తి
కొరియన్ కనకరాజు తన కెరీర్లో కచ్ఛితంగా మంచి సినిమాగా నిలుస్తుందని వరుణ్ ఎంతో నమ్మకంగా ఉన్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న కొరియన్ కనకరాజు ఇప్పటికే 80% పూర్తైందని, నవంబర్ ఆఖరికి షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అయితే ఈ సినిమా ఇంకా పూర్తవకుండానే వరుణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ లవ్‌స్టోరీ
టచ్ చేసి చూడు ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ ఓ లవ్ స్టోరీ చేయడానికి ఓకే చెప్పారట. వాస్తవానికి విక్రమ్ తో సినిమాను వరుణ్ గతేడాదే ఓకే చేసినప్పటికీ స్క్రిప్ట్ మరియు షెడ్యూల్స్ లో క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఇన్నాళ్ల వరకు సైలెంట్ గా ఉందని, ఇప్పుడు అంతా పూర్తైన నేపథ్యంలో డిసెంబర్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతుందని అంటున్నారు. గత కొన్నాళ్లుగా ప్రయోగాలకే పరిమితమైన వరుణ్, ఈసారి విక్రమ్ తో కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, విక్రమ్ ఈ సినిమాను రెగ్యులర్ లవ్ స్టోరీ లాగా కాకుండా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేయాలని చూస్తున్నారట.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో..
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుండగా, మూవీలో వరుణ్ సరసన నటించే హీరోయిన్ కోసం వెతుకుతున్నారని తెలుస్తోంది. అయితే రైటర్ గా పలు సక్సెస్‌ఫుల్ సినిమాలకు వర్క్ చేసిన విక్రమ్ సిరికొండ, డైరెక్టర్ గా మారి చేసిన టచ్ చేసి చూడు సినిమా మాత్రం భారీ ఫ్లాపుగానే నిలిచింది. అలాంటి డైరెక్టర్ తో సినిమాను ఓకే చేసి వరుణ్ రిస్క్ చేస్తున్నాడని కొందరంటుంటే, రొమాంటిక్ ఎంటర్టైనర్లుగా వరుణ్ నుంచి వచ్చిన సినిమాలు బాగా పెర్ఫార్మ్ చేశాయని, ఇప్పుడు ఈ సినిమా కూడా ఫిదా, తొలిప్రేమ లానే వరుణ్ కెరీర్ లో మంచి సినిమాగా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.
