చెల్లి కోసం అన్న పెద్ద నిర్ణయమే తీసుకున్నాడా?
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
By: M Prashanth | 28 March 2026 6:41 PM ISTమెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కెరీర్ విషయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలతో కమిట్మెంట్స్ ఉన్నప్పటికీ, తన సోదరి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న కొత్త చిత్రానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజమెంతో తెలియకపోయినా.. చెల్లి కోసం అన్న భారీ నిర్ణయం తీసుకున్నారని టాక్ నడుస్తోంది.
ఇప్పటికే వరుణ్ తేజ్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆ ప్రాజెక్ట్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, మరో రెండు నిర్మాణ సంస్థలతో కూడా ఆయన కొన్ని రోజుల క్రితం చర్చలు జరిపి ప్రాజెక్టులను ఓకే చేసినప్పటికీ, అవి కూడా ప్రస్తుతం హోల్డ్ లోకి వెళ్లినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఆ నిర్ణయం వెనుక ప్రధాన కారణం తన సోదరి నిహారిక నిర్మిస్తున్న బరి మూవీనేని వినికిడి. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూ, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని వరుణ్ తేజ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కోసం ఇతర నిర్మాతలకు కొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుత పరిస్థితిపై నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేయకుండా, పూర్తిగా సహకారం అందిస్తున్నట్లు సమాచారం.
ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ దీనిపై పాజిటివ్ ఒపీనియన్ తో ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల బరి మూవీ లాంఛింగ్ ఈవెంట్ లో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత, నిర్మాత నవీన్ ఎర్నేని పాల్గొన్నారు. అంతే కాకుండా పూజా కార్యక్రమంలో ఉత్సాహంగా కనిపించడం గమనార్హం. ఇది చూస్తే వరుణ్ తేజ్ నిర్ణయాన్ని నిర్మాతలు గౌరవిస్తున్నారని క్లియర్ గా తెలుస్తోంది.
ఫ్యామిలీ ప్రాజెక్టుకు ఆయన ఇస్తున్న ఇంపార్టెన్స్ ను అర్థం చేసుకుంటున్నారని చెప్పవచ్చు. టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఒకేసారి పలు సినిమాలు చేయడం సాధారణమే అయినప్పటికీ, ఇలా కుటుంబ సభ్యుల కోసం ప్రాజెక్టులను ముందుకు తెచ్చే ఉదాహరణలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే బరి మూవీ.. మెగా డాటర్ కు కీలకంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే నిర్మాతగా తనదైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న నిహారిక.. బరి ప్రాజెక్టుతో మరింత స్థిరపడాలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
అందుకే ఆ సినిమాకు వరుణ్ తేజ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. అలా మెగా హీరో తీసుకున్న నిర్ణయం ఓవైపు ఆయన ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ను చూపిస్తుండగా.. మరోవైపు నిర్మాతల మధ్య ఉన్న హెల్దీ రిలేషన్ ను కూడా బయటపెడుతోంది. అదే సమయంలో ప్రస్తుతం హోల్డ్ లో వరుణ్ తేజ్ ఇతర ప్రాజెక్టులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి ఏం జరుగుతుందో..
