భార్యాభర్తలుగా రియల్ లైఫ్ కు దూరంగా!
మెగా కపుల్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Srikanth Kontham | 7 May 2026 1:31 PM ISTమెగా కపుల్స్ వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహం అనంతరం మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. `మిస్టర్`, `అంతరిక్షం` లాంటి సినిమాలతో వెండితెరపై మెరిసిన జోడీ నిజ జీవితంలో ఒకటైన తర్వాత తదుపరి ప్రాజెక్టు విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలిసి నటించే సినిమా గురించి తాజాగా లావణ్య త్రిపాఠి చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్‌లో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా రియల్ లైఫ్ కపుల్స్ అనగానే? దర్శకులు వారి కోసం భార్యాభర్తల కథలను లేదా వారి వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండే స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తుంటారు.
లావణ్యకు కూడా ఇటీవల అలాంటి కథ ఒకటి వచ్చిందట. వారిద్దరి నిజ జీవిత కెమిస్ట్రీకి అద్దం పట్టేలా సాఫ్ట్ లవ్ స్టోరీ ఫ్యామిలీ డ్రామా తరహాలో ఆ కథ ఉందని సమాచారం. అయితే అచ్చంగా తమ రియల్ లైఫ్‌ను ప్రతిబింబించే పాత్రలు చేయడం లావణ్యకు పెద్దగా ఇష్టం లేదని అంటున్నారు. వరుణ్ కూడా అలాగే ఆలోచిస్తున్నాడుట. నిజ జీవితానికి దూరంగా ఓ సరికొత్త నేపథ్యంలో సినిమా చేయాలని లావణ్య ఆశపడుతున్నారు. తెరపై కూడా భార్యాభర్తలుగా కనిపిస్తే? ప్రేక్షకులకు పెద్దగా కొత్తదనం అనిపించకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.
అందుకే ఒకరికొకరు సంబంధం లేని పాత్రల్లోనో? లేదా? ఒకరిపై ఒకరు తలపడే వైవిధ్యమైన పాత్రల్లోనో కనిపిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వరుణ్ తేజ్ కూడా లావణ్యతో ఏకీభవిస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఎప్పుడూ ప్రయోగాత్మక చిత్రాలకు మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలోనే ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రావాలంటే? అది కచ్చితంగా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ అయి ఉండాలని ఆయన కోరు కుంటున్నారు. రొటీన్ ఫ్యామిలీ డ్రామాల కంటే యాక్షన్ థ్రిల్లర్ లేదా పీరియాడిక్ డ్రామా వంటి కథలైతే తమ నటనలోని కొత్త కోణాలను ఆవిష్కరించొచ్చని యోచిస్తున్నట్లున్నారు.
క్రేజ్ కోసం కాకుండా? కంటెంట్ కోసం జతకట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ సొంత ప్రాజెక్టులతో బిజీగా ఉండగా లావణ్య కూడా వెబ్ సిరీస్ , సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇద్దరు కలిసి నటించే అవకాశం వస్తే? అది కేవలం ఒక కమర్షియల్ సినిమాలా కాకుండా ప్రేక్షకులకు ఒక సర్ప్రైజ్ ఇచ్చేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. కథలో దమ్ముంటేనే పాత్రలు విభిన్నంగా ఉంటేనే తాము స్క్రీన్ షేర్ చేసుకుంటామని పరోక్షంగా హింట్ ఇచ్చారు. వరుణ్-లావణ్యల ఆలోచనా దృక్పథం చాలా పరిణతితో కూడుకుంది. నిజ జీవిత బంధాన్ని వెండితెరపై క్యాష్ చేసుకోవాలని చూడకుండా నటీనటులుగా బాధ్యతను గుర్తించడం అభినందనీయం. ఇద్దరు కోరుకున్నట్లుగా ఏదైనా విభిన్నమైన కథ దొరికితే వెండితెరపై మెగా జంట మ్యాజిక్ చేసే అవకాశం ఉంది.
