ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేయలేదు.. కొరియన్ కనకరాజు టీమ్ క్లారిటీ
మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు ఈరోజు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 7 Aug 2026 6:41 PM ISTమెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా కొరియన్ కనకరాజు ఈరోజు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాకి నిన్న రాత్రి పడిన ప్రీమియర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్లాన్ చేసిన వందకు పైగా ప్రీమియర్ షోలు అన్నీ హౌస్ ఫుల్ అవ్వడంతో మంచి స్టార్ట్ అయితే లభించింది. ఇక ఈరోజు ఉదయం ఆటల నుంచి పబ్లిక్ మౌత్ టాక్ పాజిటివ్ గా ఉండటంతో బుక్ మై షో యాప్ లో ఈ సినిమా బలంగా ట్రెండ్ అవుతోంది.
అయితే సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సినిమా రిలీజ్ కు ముందు తాను చాలా టెన్షన్ పడ్డానని హీరో వరుణ్ తేజ్ ఓపెన్ గా వివరణ ఇచ్చారు. కానీ నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచి వస్తున్న టాక్ చూశాక తన మైండ్ చాలా రిలాక్స్ అయిందని అన్నారు. తన కెరీర్ లో దాదాపు ఆరు ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇంత పెద్ద సక్సెస్ చూడటం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
థియేటర్లలో స్క్రీన్ మీద తన యాక్టింగ్ కు జనాల నుంచి మంచి అప్లాజ్ వస్తోందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు. సినిమాలో ముఖ్యంగా కమెడియన్ సత్యతో కలిసి చేసిన కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయని టాక్ వస్తోంది. ఈ ట్రాక్ సినిమాకు బాగా ప్లస్ అయిందని ఆయన అన్నారు. అదే క్రమంలో సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ గారిని ట్రోల్ చేశారంటూ వస్తున్న వార్తలపై డైరెక్టర్ మేర్లపాక గాంధీ నేరుగా స్పందిస్తూ అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
సినిమాలో కమెడియన్ సత్యతో చేయించిన ఇమిటేషన్ కేవలం ఆ సిట్యువేషన్ కి తగ్గట్టుగా సరదా కోసం డిజైన్ చేసింది మాత్రమేనని డైరెక్టర్ గాంధీ వివరణ ఇచ్చారు. అంతటి గొప్ప లెజెండరీ నటుడిని కించపరిచే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని చెప్పారు. కావాలని తప్పుగా చూపించాలనే ఆలోచన తమ టీమ్ లో ఎవరికీ లేదని ఆయన వెల్లడించారు. ఎక్స్ ప్రెస్ రాజా తర్వాత తనకు మళ్లీ దొరికిన బెస్ట్ కమర్షియల్ సక్సెస్ ఇదేనంటూ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన స్పెషల్ గా థాంక్స్ చెప్పారు.
ఈ సినిమా విజయంతో తన కొడుకు వాయువ్ తేజ్ తనకు బాగా కలిసొచ్చాడని వరుణ్ తేజ్ ఈ మీట్ లో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. బాబు పుట్టిన తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి ఒక సాలిడ్ హిట్ అందుకోవడం నిజంగా తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇన్నాళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న తనకు ఈ రిజల్ట్ ఒక కొత్త ఎనర్జీ ఇచ్చిందని అన్నారు.
ఇక సినిమా రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు కూడా తనతో ఫోన్లో మాట్లాడారని వరుణ్ తేజ్ ఈ సందర్భంగా వెల్లడించారు. సినిమాకు వస్తున్న పాజిటివ్ టాక్ గురించి తెలుసుకుని ఆయన దాదాపు అరగంట పాటు తనతో ముచ్చటించారని చెప్పారు. త్వరలోనే ఆయన కూడా సినిమా చూసి తన ఫీడ్ బ్యాక్ ఇస్తారని వరుణ్ ఆనందం వ్యక్తం చేశారు.
