కొరియా వీధుల్లో కొరియన్ ఫైటర్స్‌తో కనకరాజు
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా చివరి షెడ్యూల్ రేపటి నుంచి కొరియాలోని అందమైన ప్రదేశాల్లో ప్రారంభం కానుంది.
By: Sivaji Kontham | 14 March 2026 12:58 AM ISTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన విలక్షణమైన కథా ఎంపికలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం అతడు నటిస్తున్న `కొరియన్ కనకరాజు` చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమా చిత్రీకరణ కోసం వరుణ్ తేజ్ నేరుగా కొరియాకు వెళ్లడం, అక్కడ కొరియన్ టెక్నీషియన్లు , నటీనటులతో కలిసి పని చేయడం ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తుంటే వరుణ్ తన పాత్ర కోసం పూర్తి స్థాయిలో మేకోవర్ అయినట్లు అర్థమవుతోంది.
`కొరియన్ కనకరాజు` సినిమా ఒక ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. కథాంశం ప్రకారం.. ఒక సాదాసీదా తెలుగు కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో కొరియాకు వెళ్లాల్సి రావడం..అక్కడ అతను ఎదుర్కొన్న సవాళ్లు.. అక్కడి వారితో ఏర్పడిన అనుబంధం చుట్టూ ఈ కథ తిరుగుతుందని సమాచారం. కొరియన్ సంస్కృతికి, మన నేటివిటీకి మధ్య ఉండే వైవిధ్యాన్ని దర్శకుడు ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించబోతున్నారు. అందుకే ఈ సినిమా మేజర్ పార్ట్ కొరియాలోనే చిత్రీకరిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా చివరి షెడ్యూల్ రేపటి నుంచి కొరియాలోని అందమైన ప్రదేశాల్లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు.. కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నారు. కొరియన్ స్టంట్ మాస్టర్స్ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ పోరాట ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి చేసి.. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ సినిమాలో కాస్టింగ్ విషయానికి వస్తే... వరుణ్ తేజ్ సరసన మిరాయ్ ఫేం రితిక నాయక్ నటిస్తోంది. ఒక విదేశీ నటి లేదా కొరియన్ నటి కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వరుణ్ తేజ్ గడిచిన కొన్ని సినిమాల బాక్సాఫీస్ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆయనకు ఒక పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అవసరం ఉంది. ఈ క్రమంలో `కొరియన్ కనకరాజు` అతడి కెరీర్‌ను మళ్ళీ ట్రాక్‌లోకి తెస్తుందని అభిమానులు ఈ సినిమాపై గట్టి ఆశలే పెట్టుకున్నారు.
వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాల విషయంలోనూ చాలా క్లారిటీతో ఉన్నారు. దర్శకుడు మారుతి ఇప్పటికే వరుణ్ తేజ్‌కు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ కథను వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథలో హీరో పాత్రలో ఒక ఊహించని సర్ ప్రైజ్ వినోదం పాళ్లు పెంచుతుందని కూడా టీజర్ హింట్ ఇచ్చింది. ఈ సినిమా కోసం `హ్యాపీ పొంగల్` అనే టైటిల్‌ను కూడా రిజిస్టర్ చేశారని సమాచారం. మారుతి మార్క్ కామెడీ , వరుణ్ తేజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే అది కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
మొత్తానికి `కొరియన్ కనకరాజు`తో వరుణ్ తేజ్ ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. కొరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టెక్నికల్‌గా చాలా ఉన్నతంగా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వరుణ్ తేజ్ ఖాతాలో ఒక భారీ విజయాన్ని చేర్చాలని.., అతడి కెరీర్ మళ్ళీ పుంజుకోవాలని మెగా అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
