ప్రీమియర్స్ తోనే రికార్డు సృష్టించిన కొరియన్ కనకరాజు.. సూపర్ హిట్ గ్యారెంటీ?
గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 7 Aug 2026 10:43 AM ISTగత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన తండ్రి నాగబాబు ప్రధాన పాత్ర పోషించిన హ్యాండ్సప్ అనే చిత్రంలో బాల నటుడిగా నటించి.. తన కెరీర్ ను మొదలుపెట్టిన వరుణ్ తేజ్.. మళ్లీ 2014లో తొలిసారి ముకుంద సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత కంచె , లోఫర్, మిస్టర్ , ఫిదా, తొలిప్రేమ, అంతరిక్షం, ఎఫ్ 2 ఇలా పలు చిత్రాలు చేస్తూ హీరోగా నిలదొక్కుకున్నారు. ఇకపోతే వరుస చిత్రాలు చేస్తున్నారు కానీ స్టార్ హీరో రేంజ్ లో అయితే ఈయన ఖాతాలో సూపర్ హిట్ ఒకటి కూడా పడలేదని చెప్పాలి.
దీంతో ఎలాగైనా సరే మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్న వరుణ్ తేజ్.. ఏకంగా తన కెరీర్లో తొలిసారి జానర్ మార్చి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హారర్ కామెడీ మూవీగా కొరియన్ కనకరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆగస్టు 6వ తేదీన ప్రీమియర్స్ పడగా.. ఈ ప్రీమియర్స్ తో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి వస్తున్న ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 125 షోలను ప్లాన్ చేయగా.. అందులో ఏకంగా 100 షోలు హౌస్ ఫుల్ కావడం గమనార్హం. ముఖ్యంగా వరుణ్ తేజ్ కెరియర్ లోనే ఈ సినిమా ప్రీమియర్ తో అతిపెద్ద ఓపెనింగ్ అందుకుంది అని చెప్పవచ్చు.
వరుణ్ తేజ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ పోషించారు. అమాయకుడైన అనంతపురం యువకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్.. మరొకవైపు క్రూరమైన కొరియన్ మాఫియా డాన్ ఆత్మగా కూడా ఆకట్టుకున్నారు. నిజానికి అటు రాయలసీమ యాస, ఇటు కొరియన్ భాష రెండు వరుణ్ తేజ్ కి కొత్త అయినా.. అందులో ఆయన చాలా లీనం అయిపోయారనే చెప్పాలి. ముఖ్యంగా కథలోని మలుపులు, వినోద భరిత అంశాలు, హారర్ చాలా అద్భుతంగా పండించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వ నైపుణ్యం పై సినిమా చూసిన ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సత్య కామెడీ చాలా ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు వరుణ్ తేజ్ - సత్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను థియేటర్లలో కడుపుబ్బా నవ్వించాయి.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ కొరియన్ కనకరాజు సినిమాకి ఎక్కడ చూసినా సానుకూల స్పందన రావడంతో తమ వ్యూహం ఇంత పెద్ద విజయం సాధించడం చూసి అటు నిర్మాతలు సైతం ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. పైగా శని, ఆదివారాలు సెలవులు కావడంతో ఈ సినిమాకు కలెక్షన్స్ మరింత కలిసొచ్చే అవకాశాలు కల్పిస్తున్నాయి. పైగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇందులో రితిక నాయక్ హీరోయిన్ గా నటించగా.. ఈ చిత్రాన్ని ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి , సాయిబాబా జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతం అందించారు. ప్రీమియర్ తోనే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా మొదటిరోజు ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి
