Begin typing your search above and press return to search.

KOKA గ్లింప్స్: మాస్ టచ్ తో భయపెడుతున్న వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.

By:  M Prashanth   |   19 Jan 2026 10:54 AM IST
KOKA గ్లింప్స్: మాస్ టచ్ తో భయపెడుతున్న వరుణ్ తేజ్
X

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త కంటెంట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈసారి టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీతో కలిసి ఒక క్రేజీ ఎంటర్టైనర్‌ను పట్టాలెక్కించారు. యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు 'కొరియన్ కనకరాజు' (KOKA) అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





ఈ గ్లింప్స్ చూస్తుంటే మేర్లపాక గాంధీ మరోసారి తనదైన మార్క్ హ్యూమర్, యాక్షన్‌ ప్లస్ హారర్ ని మిక్స్ చేసినట్లు అర్థమవుతోంది. వీడియో ప్రారంభంలో కొరియన్ పోలీసులు సత్యను చితకబాదుతూ కనకరాజు ఎక్కడ అని ప్రశ్నించడం ఆసక్తికరంగా ఉంది. అనంతపురం జిల్లా పెనుకొండకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అని సత్య చెప్పే డైలాగులు నవ్వు తెప్పిస్తున్నాయి.

ఆ తర్వాత వచ్చే విజువల్స్ పక్కా హర్రర్ అండ్ యాక్షన్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా గబ్బిలాలు, చందమామ, డ్రాగన్ బొమ్మ ఉన్న పాత్ర.. ఇవన్నీ ఏదో మిస్టరీ ఉందనే క్యూరియాసిటీని పెంచుతున్నాయి. ఇక వరుణ్ తేజ్ ఎంట్రీ మాత్రం పక్కా మాస్‌గా ఉంది. చేతిపై త్రిశూలం, డమరుకం టాటూలు.. మొరటైన లుంగీ కట్టు, పెరిగిన జుట్టుతో వరుణ్ లుక్ చాలా కొత్తగా ఉంది.

భయంకరమైన కళ్ళతో ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ సీరియస్ గా ఉన్నా, బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే థమన్ మ్యూజిక్ మాత్రం సీన్ కు మంచి హైప్ ఇచ్చింది. చివర్లో టేబుల్ మీద కూర్చుని కొరియన్ భాషలో 'నేను వచ్చేశా' అని వరుణ్ చెప్పే డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. అలాగే అతను మన కనకరాజు కాదు అని సత్య మరో ట్విస్ట్ ఇవ్వడం హైలెట్ అయ్యింది. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య మరోసారి తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకోబోతున్నారు.

మేర్లపాక గాంధీ గత చిత్రాల్లాగే ఇందులో కూడా కామెడీ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉండేలా చూసుకున్నారు. ఒక పక్కా లోకల్ క్యారెక్టరైజేషన్ కు కొరియన్ సెటప్ ను జోడించడం అనేది ఒక కొత్త ప్రయోగం అని చెప్పవచ్చు. టెక్నికల్ గా చూస్తే మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త రకమైన జోనర్ల వైపు హీరోలు మొగ్గు చూపుతున్నారు. వరుణ్ తేజ్ కూడా మాస్ అండ్ హర్రర్ కామెడీ జోనర్‌ను ఎంచుకోవడం మంచి పరిణామమే.

ఈ గ్లింప్స్‌లో చూపించిన విజువల్స్ సినిమా క్వాలిటీపై నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లా అనిపిస్తున్న ఈ సినిమాను 2026 సమ్మర్ కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక 'కొరియన్ కనకరాజు' గ్లింప్స్ వరుణ్ తేజ్ ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ బర్త్‌డే ట్రీట్ అని చెప్పాలి. మేర్లపాక గాంధీ తన మ్యాజిక్ ను కరెక్ట్ గా వర్కౌట్ చేస్తే సమ్మర్ బాక్సాఫీస్ వద్ద కనకరాజు హవా చూడవచ్చు.